జీ 20 మొదటి ఆర్థిక, సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం

భారతదేశం అధ్యక్షతన జీ 20 మొదటి ఆర్థిక, సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం బెంగళూరులో డిసెంబర్ 13,14,15 తేదీల్లో జరగనున్నది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత రిజర్వు బ్యాంకు సంయుక్తంగా నిర్వహిస్తున్న సమావేశంలో భారతదేశం అధ్యక్షత వహిస్తున్న జీ 20 దేశాలకు ముఖ్యమైన ఆర్ధిక అంశాలు అమలు జరుగుతున్న తీరును సమీక్షించడానికి అనుసరించాల్సిన చర్యలను చర్చిస్తారు. 

జీ 20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల అధ్యక్షతన జీ20 దేశాల ఫైనాన్స్ ట్రాక్ పనిచేస్తుంది. ఆర్థిక అంశలపై ప్రధానంగా దృష్టి సారించి జీ20 ఫైనాన్స్ ట్రాక్ పనిచేస్తుంది. ప్రపంచ స్థాయి ఆర్థిక అంశాలపై చర్చలు జరిపేందుకు, విధాన నిర్ణయాల సమన్వయానికి జీ20 ఫైనాన్స్ ట్రాక్ ఓకే వేదికగా ఉంటుంది. ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం 2023 ఫిబ్రవరి 23,24,25 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది.

బెంగళూరులో డిసెంబర్ 13,14,15 తేదీల్లో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ మైఖేల్ డి.పాత్ర సహా అధ్యక్షతన జీ 20 ఆర్థిక, సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. రెండు రోజుల పాటు సమావేశంలో జీ20 సభ్య దేశాల ఆర్థిక వ్యవహారాల అధికారులు, సెంట్రల్ బ్యాంకుల ప్రతినిధులు, భారతదేశం నుంచి ఆహ్వానం అందిన అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు పాల్గొంటారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తో సంబంధం ఉన్న ప్రధాన అంశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్వరూపం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, మౌలిక సదుపాయాల అభివృద్ధి,నిధుల సమీకరణ, సుస్థిర ఆర్థిక విధానాలు, ప్రపంచ స్థాయి ఆరోగ్య రంగం, అంతర్జాతీయ పన్నుల విధానంతో పాటు ఆర్థిక రంగానికి సంబంధించి వివిధ అంశాలు సమావేశంలో చర్చకు వస్తాయి.

భారతదేశం అధ్యక్షతన జీ20 ఫైనాన్స్ ట్రాక్ అమలు చేయాల్సిన అంశాలపై బెంగళూరు సమావేశం దృష్టి సారిస్తుంది. 21వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లకు అనుగుణంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రాధాన్యత అంశాలను నిర్ణయించడం, భవిష్యత్తు ఆర్థిక నగరాలు, ప్రపంచ రుణ భారం నిర్వహణ, ఆర్థిక చేరిక మరియు ఉత్పాదకత ప్రయోజనాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర లక్ష్యాల సాధనకు నిధుల సమీకరణ, క్రిప్టో ఆస్తులు, అంతర్జాతీయ పన్ను విధానంలో మార్పులు తీసుకు రావడం లాంటి అంశాలు సమావేశంలో చర్చకు వస్తాయి.

సమావేశంలో భాగంగా ’21 వ శతాబ్దంలో ఉమ్మడిగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి బహుముఖ బ్యాంకులను పటిష్టం చేయడం’ అనే అంశంపై నిపుణుల చర్చలు జరుగుతాయి. ‘గ్రీన్ ఫైనాన్సింగ్ లో సెంట్రల్ బ్యాంకుల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరుగుతుంది.  భారతదేశం ప్రతిపాదించిన ‘ఒక విశ్వం, ఒక కుటుంబం,ఒక భవిష్యత్తు’ విధానం జీ20 ఫైనాన్స్ ట్రాక్ సమావేశంలో చర్చకు వస్తుంది.

దేశం వివిధ ప్రాంతాల్లో ఫైనాన్స్ ట్రాక్ సమావేశాలు జరుగుతాయి. దీనిలో భాగంగా జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశం నిర్వహిస్తారు. జీ20 ఫైనాన్స్ ట్రాక్ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు జీ20 అగ్రనాయకుల సంయుక్త ప్రకటనలో చేర్చడం జరుగుతుంది.

 వివిధ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో జీ20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం చేపట్టింది. కోవిడ్-19 మహమ్మారి రూపంలో ఎదురైన సవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులు, ఆహారం, ఇంధన రంగంలో ఎదురవుతున్న సమస్యలు, పెరుగుతున్న రుణభారం, ద్రవ్యోల్బణం పరిస్థితి, నిధుల కొరత లాంటి సమస్యలు ఎదురవుతున్న సమయంలో జీ20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం స్వీకరించింది. అన్ని సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి అనుసరించాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన వ్యూహాలకు జీ20 రూపకల్పన చేసి సభ్య దేశాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది.

సహకారం అవసరమైన దేశాలకు పూర్తి సహాయ సహకారాలు అందించి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని భారతదేశం నిర్ణయించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని జీ20 ఫైనాన్స్ ట్రాక్ సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఉజ్వల భవిష్యత్తు నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది.