కవితను ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన సీబీఐ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం ఏడు గంటలకు పైగా విచారించారు.  సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద నోటిసు ఇచ్చిన అధికారులు ఆదివారం ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఇక్కడి ఆమె నివాసానికి చేరుకున్నారు.
 ఆరుగురు సీబీఐ అధికారులతో కూడిన బృందానికి రాఘవేంద్ర వస్త నాయకత్వం వహించారు. సాయంత్రం 6 గంటల వరకు వివరణ తీసుకున్నారు. మహిళను విచారిస్తున్న సందర్భంలో మహిళా సీబీఐ అధికారి కూడా తమ వెంట తీసుకు వచ్చారు.
కవిత స్టేట్ మెంట్ ను  రికార్డు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియా రికార్డింగ్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఉదయం నుంచి అడ్వొకేట్ సమక్షంలో అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజన సమయం తర్వాత సీబీఐ అధికారులు అడ్వొకేట్ను బయటకు పంపి.. కవితను విడిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో మీకు ఉన్న సంబంధాలేమిటి?, ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఉందా?, అమిత్ అరోరా మీకు తెలుసా? అమిత్ అరోరాతో ఉన్న సంబంధం ఏమిటి?, అమిత్ అరోరా కాల్‌లిస్ట్‌లో మీ నంబర్ ఎందుకు ఉంది? సౌత్ గ్రూప్‌లో మీ పాత్ర ఉందా? అమిత్ అరోరా మీ పేరు ఎందుకు చెప్పారు?, 
 
విజయ్ నాయర్ మీకు తెలుసా? విజయ్ నాయర్‌కి రూ.100 కోట్ల తరింపులో మీ పాత్ర ఉందా? లిక్కర్ పాలసీ, లిక్కర్ తయారీ కంపెనీలకు అనుకూలంగా రూపొందించడంలో మీ పాత్ర ఉందా? ఢిల్లీలో ఎక్సైజ్ శాఖ అధికారులను కలిశారా?, లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీరు భాగస్వామిగా ఉన్నారా? అమిత్ నాయర్, విజయ్ నాయర్‌తో ఉన్న సంబంధం ఏమిటీ?, సౌత్ గ్రూప్ కంట్రోలర్‌గా మీరు ఉన్నారా? తదితర ప్రశ్నలను సంధించినట్లు సమాచారం.
 
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆమెను సాక్షిగా మాత్రమే విచారించారు. ఇంతటితో విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారిస్తారా? అనే దానిపై సిబిఐ అధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు.  లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరును ఈడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించింది.
 ఈ రిపోర్టులోనే కవిత పేరు తెరపైకి వచ్చింది. ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను సౌత్‌గ్రూప్ చెల్లించినట్టు పేర్కొన్న ఈడీ ఈ మొత్తాన్ని సమకూర్చిన వారిలో కవిత పేరును కూడా చేర్చింది.  సౌత్ గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి నియంత్రించారని ఈడీ తెలిపింది. సౌత్‌గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లను విజయ్‌ నాయర్‌కు చేర్చినట్టు వెల్లడించింది. ఆ తర్వాత కవితకు సీబీఐ  నోటీసు ఇచ్చింది.
 నిందితులైన బోయినపల్లి  అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర  పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ  సమీర్ మహేంద్రు స్టేట్మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.  ఈ కేసులో కవిత విచారణ ఇప్పటివరకైతే ముగిసినట్లేనని, భవిష్యత్‌లో అవసరమైతే మళ్లీ విచారిస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి.
 సీబీఐ విచారణ ముగిసిన గంటన్నర తర్వాత ఆమె తన నివాసం నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లిపోయారు.  ఇంటి వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలకు కవిత అభివాదం చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు.అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, తన అడ్వకేట్‌తో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లారు. సీబీఐ విచారణపై తన తండ్రి, సీఎం కేసీఆర్‌ తో కవిత వివరించనున్నట్లు తెలుస్తోంది.