అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మికత, సేవాగుణం అలవడతాయి 

అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మికత, సేవాగుణం అలవడతాయి 
హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి శరణుఘోషతో ఆదివారం నారాయణగూడ ప్రాంతం మార్మోగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో అయ్యప్పస్వామి మహా పడిపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దంపతులు అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించారు.
అనంతరం పదునెట్టాంబడిపై స్వామి వారికి షోడశోపచారాలు నిర్వహించారు. తర్వాత అయ్యప్ప స్వాములు శరణుఘోషతో పాటు, భజనలు, పాటలతో ఆ ప్రాంతం మార్మోగింది. గురుస్వామి ఆత్రేయాచార్యుల చేతుల మీదుగా జరిగిన పూజా కార్యక్రమంలో గాయకుడు జడల రమేష్ (సిరిసిల్ల భజన బృందం) ఆలపించిన పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి.
భజన బృందం, ఆర్కెస్ర్టా, దేవతా మూర్తుల వేషధారణతో కళాకారులు నృత్యాలతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా  కిషన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్పస్వామి దీక్ష కారణంగా భక్తుల్లో ఆధ్యాత్మిక జీవనశైలితోపాటు, సేవాగుణం అలవడుతుందని తెలిపారు.
కార్తీకమాసంలో లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి మాలధారణతో తమ జీవితాల్లో సానుకూల మార్పును స్వాగతిస్తారని చెప్పారు.గత 22 ఏళ్లుగా ఘనంగా అయ్యప్పస్వాములతో మహా పడిపూజోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.
 
అనంతరం, స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దంపతులు అయ్యప్ప స్వాములుకు భోజనం వడ్డించడంతో పాటు తాంబూలాన్ని అందించి వారి ఆశీస్సులు పొందారు.  ఈ పడిపూజోత్సవంలో  సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటుగా నగరంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు 
బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, స్థానిక ఎమ్యెల్యే ముఠా గోపాల్, బీజేపీ సీనియర్ నాయకులైన ఎన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ శ్రీమతి విజయశాంతి, మాజీ ఎమ్యెల్యే  నందీశ్వర్ గౌడ్, మాజీ ఎంపీ  వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్యెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.