ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా పెట్టిన బీఆర్ఎస్ పార్టీలోనూ మద్యం ఆనవాళ్లే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మేడిపల్లి ప్రజా సంగ్రామ సభలో మాట్లాడుతూ లండన్ లో తయారయ్యే డ్రై జిన్ ను బీఆర్ఎస్ బ్రాండ్ విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బ్రాండ్ ఫోటోను ప్రదర్శించారు.
కేసీఆర్ బిడ్డ పులిబిడ్డ అని, ఆమెను అరెస్ట్ చేస్తే ఖబడ్దార్… అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీబీఐని హెచ్చరించడంపై మండిపడుతూ ‘‘కేసీఆర్ బిడ్డ… అత్తగారి ఇంటికి పోతుందా? బొట్టు పెట్టి పిలుస్తారా? స్వాతంత్ర్య సమరయోధురాలా?… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేస్తరా? అని అడుగుతున్నరు” అంటూ ప్రశ్నించారు.
మీరు ఇట్లనే చేసి విచారణను అడ్డుకోవాలని చూస్తే మిమ్ముల్ని కూడా సీబీఐ అధికారులు తీసుకెళతారు జాగ్రత్త అంటూ సంజయ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ లో తెలంగాణ పేరు తీసేయడమంటే ‘తెలంగాణ తల్లి’కి ద్రోహం చేసినట్లేనని మండిపడ్డారు. ఏ పార్టీ పేరు మీద అయితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో… ఆ పేరునే తీసేసిండు. ప్రజలను మోసం చేసిండని విమర్శించారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి ఏమైంది?
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలతో ఆయన సమావేశమై గల్ఫ్ కార్మికుల సంక్షేమం, అభివృద్దికి ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.
కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, గల్ఫ్ కార్మికులను ఉద్దేశించి చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం సంగతి దేవుడెరుగు… గల్ప్ లో చనిపోతే వారి శవాలను కూడా తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికీ ఎంతో మంది గల్ఫ్ లో ఉద్యోగాలు దొరకక, ఏజెన్సీల మాటలు నమ్మి మోసపోయి జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉంటే గల్ఫ్ కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. విదేశాలతో మాట్లాడి అక్కడున్న సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే గల్ప్ కార్మికుల సంక్షేమ డిమాండ్లన్ని నెరవేర్చడంతో పాటు గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More Stories
సంఘ్లో ఏమి నేర్పినా అవన్నీ దేశం కోసమే
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
భగీరథ్ కేసులో ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు