గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్‌ పటేల్‌ రెండోసారి ప్రమాణం చేశారు. సోమవారం గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్‌ భవనంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ దేవవ్రత్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ,సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు మరో 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో కున్వర్జీభాయ్ మోహన్‌భాయ్ బవలియా, ములు అయర్ బేరా,కాను దేశాయ్, హృషీకేశ్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంత్ సింహ్ రాజ్‌పుట్, కుబేర్ డిండోర్, భాను బబారియా, హర్ష సంఘవి, జగదీశ్ విశ్వకర్మ, రజనీకాంత్ పటేల్ ఉన్నారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బిజెపి చీఫ్ జేపీ నడ్డా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల సీఎంలు, స్మృతి ఇరాని, పలువురు బిజెపి నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భూపేంద్ర భాయ్‌ పటేల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే బీజేపీ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పార్టీ అధిష్ఠానం ఆయనకే పాలనా పగ్గాలు అప్పజెప్పింది.

రెండు విడుతల్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 156 సీట్లను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమవగా, ఆప్‌ 5 స్థానాల్లో గెలుపొందింది. ఇక సీఎం భూపేంద్ర పటేల్.. అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.