టీఎంసీ నేత సాకేత్‌ పై మేఘాలయ ప్రభుత్వం పరువు నష్టం దావా

తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) జాతీయ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలేపై మేఘాలయ ప్రభుత్వం పరువు నష్టం దావా వేసింది. ఆయన ఇటీవల చేసిన అవినీతి ఆరోపణలపై ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈ నెల 4న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు.
మేఘాలయ ఎకో టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో రూ.632 కోట్ల అవకతవకలు జరిగాయని విమర్శించారు. సీఎం కాన్రాడ్ సంగ్మా అత్యున్నత సహాయకుడు, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలోని మేఘాలయన్ ఏజ్ కంపెనీ ద్వారా ఈ అక్రమాలు జరిగాయని ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు.
టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపణలపై మేఘాలయ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆయన సైకో మాదిరిగా మారారని డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ టిన్సాంగ్ విమర్శించారు. తమ ప్రభుత్వ ప్రతిష్టను చెడగొట్టడమే టీఎంసీ నేత ఉద్దేశమని ఆరోపించారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వానికి చెందిన మేఘాలయన్ ఏజ్ లిమిటెడ్ సంస్థ లీగల్‌ చర్యలు చేపట్టింది. టీఎంసీ నేత సాకేత్ గోఖలేపై పరువు నష్టం దావా వేసింది. సీఎం సంగ్మాతోపాటు ప్రభుత్వంపై తప్పుడు, పరువు నష్టం కలిగించేలా మీడియాకు స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేసింది.