భారత్‌-పాక్‌ మధ్య ఎలాంటి క్రికెట్‌ సంబంధాలు ఉండవు

వచ్చే ఏడాది పాక్‌లో జరగబోయే ఆసియా కప్‌ 2023పై సందిగ్ధత నెలకొంది. టోర్నీని పాక్‌లోనే నిర్వహిస్తామని పీసీబీ (పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌) ప్రెసిడెంట్‌ రామిజ్‌ రాజా చెబుతుండగా.. పాక్‌లో అడుగుపెట్టేది లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పటికే స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి డా. జైశంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించే వరకూ భారత్‌-పాక్‌ మధ్య ఎలాంటి క్రికెట్‌ సంబంధాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
‘టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి. అయితే ప్రభుత్వ విధానాలు, క్రికెట్‌పై మా వైఖరేంటో మీకు తెలుసు. ఉగ్రవాదాన్ని ఓ దేశం ప్రోత్సహిస్తుంటే దాన్ని మనం అంగీకరించకూడదు. మేం దీనిపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదో క్లిష్టమైన సమస్య’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.