విశాఖ నగరాన్ని ఐటి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి 

విశాఖపట్నం నగరాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. శుక్రవారం రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
దేశంలోనే పెద్ద నగరాల్లో ఒకటైన విశాఖపట్నం స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో దేశంలోనే 9వ స్థానంలో ఉందని,అలాగే నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో విశాఖ ఐటీ కేంద్రంగా మారేందుకు అన్ని రకాల అవకాశాలు కలిగి ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సంస్థలను విశాఖపట్నంలో కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఐటీ రంగంలో యావత్ రాష్ట్రమే పూర్తిగా వెనకబడిపోయిందని జీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి పరచడానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని అందజేయాలని, ఈ క్రమంలో కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలను విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
స్టార్ట్ అప్ సంస్థలను ప్రోత్సహించేందుకు ;సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా’  విశాఖపట్నం విభాగానికి అదనంగా కనీసం మరో 30 వేల చదరపు అడుగుల స్థలం అవసరమని జీవీఎల్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థలాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భూమిని కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగాల్లోని తయారీ యూనిట్లకు అవసరమైన అనేక నూతన ఆవిష్కరణలను తయారు చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశ్రామికీకరణ 4.0 విధానం కింద కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ఒక ‘కామన్ ఇంజనీరింగ్ అండ్ ఫెసిలిటీ సెంటర్’ను సమర్థ భారత్ విధానాల్లో భాగంగా విశాఖకు కేటాయించాలని జీవీఎల్ కోరారు.
అలాగే ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్’ను విశాఖలో ప్రారంభించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వివిధ పారిశ్రామిక అవసరాలకు అవసరమైన యంత్ర సామగ్రిని, విడి పరికరాలను తయారు చేయడానికి అవసరమైన ‘ఫ్యాబ్రికేషన్ లాబరేటరీ’ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని జీవీఎల్ కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను పెంచడం కోసం బీపీఓ స్కీమును ప్రారంభించి కొనసాగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కోరారు. ఇందుకు తగిన నైపుణ్యాలతో మానవ వనరులు విశాఖ నగరంలో ఉన్నాయని వివరించారు.