బహిరంగ మరణశిక్ష అమలు జరిపిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత తొలిసారి తాలిబాన్‌ ప్రభుత్వం మరణ శిక్షలను అమలు చేసింది. ఓ వ్యక్తికి బహిరంగంగా మరణశిక్ష విధించింది. రైఫిల్‌తో బుల్లెట్లు పేల్చి ఆ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ శిక్ష అమలు సందర్భంగా ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, సైనికాధికారులు కూడా పాల్గొన్నారు.
హత్యా నేరానికి పాల్పడిన ఓ వ్యక్తిని ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫరా ప్రావిన్స్‌లో తాలిబాన్‌ బహిరంగంగా ఉరితీసింది. స్పోర్ట్స్ స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో హత్యకు పాల్పడిన నిందితుడిని కాల్చి చంపినట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ధృవీకరించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత బహిరంగంగా చంపడం ఇదే తొలిసారి.
హత్యకు పాల్పడిన వ్యక్తిని కిక్కిరిసిన స్టేడియంలో మృతుడి తండ్రే రైఫిల్‌తో మూడుసార్లు కాల్చి చంపాడు. బహిరంగంగా విధించిన ఈ శిక్షను చూసేందుకు పలువురు తాలిబాన్ నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సైనికాధికారులు, పలువురు సీనియర్ మంత్రులు కూడా వచ్చారని జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.
హెరాత్ ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తికి తాలిబన్లు మరణశిక్ష విధించిన సంఘటన ఐదేండ్ల క్రితం జరిగింది. ఇందులో తజ్మీర్ అనే వ్యక్తి ఫరా ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తిని హత్య చేసి అతడి మోటార్‌సైకిల్‌, ఫోన్‌ను అపహరించాడు. మృతుడి కుటుంబ సభ్యులు నిందితుడిపై ఫిర్యాదు చేయగా తాలిబాన్‌ ప్రభుత్వం అతడిని అరెస్టు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన తాలిబాన్‌ కోర్టు ఒకటి మరణశిక్ష విధించడంతో.. అధికారులు బహిరంగంగా ఆ శిక్షను అమలుచేశారు. దోషులను బహిరంగంగా శిక్షించాలని న్యాయమూర్తులను తాలిబాన్‌ ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఏ నేరానికి ఎలాంటి శిక్ష విధిస్తారో ఇప్పటి వరకు తాలిబాన్ అధికారికంగా వెల్లడించలేదు. తాలిబాన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా గత నెలలో ఈ ప్రకటన చేయడంతో తొలిసారి మరణశిక్షను అమలు చేశారు.
నిరసనకారుడిని ఉరితీసిన ఇరాన్ 
 
 కాగా, ఇటీవ‌లభారీగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న ఇరాన్ లో స్థానిక ప్ర‌భుత్వం ఓ నిర‌స‌న‌కారుడిని ఉరి తీసింది. మోషెన్ షేకారి అనే వ్య‌క్తిని ఉరి తీశారు. ప్ర‌భుత్వ ద‌ళాల‌కు వ్య‌తిరేకంగా అత‌ను నిర‌స‌న తెలిపాడు. టెహ్రాన్‌లో సెప్టెంబ‌ర్‌లో మోషేన్ ఓ రోడ్డుపై ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాడు.
త‌న వ‌ద్ద ఉన్న మ‌చ్చు క‌త్తితో పారామిలిట‌రీ ద‌ళ స‌భ్యుడిని గాయ‌ప‌రిచాడు. ఆ ఘ‌ట‌న‌లో మోషేన్‌పై విచార‌ణ చేప‌ట్టి అత‌న్ని దోషిగా తేల్చారు. నిర‌స‌న‌కారుల‌కు క్ర‌మ‌క్ర‌మంగా మ‌ర‌ణ‌శిక్ష‌ను అమ‌లు చేసేందుకు ఇరాన్ ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.