హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనకారుడిని ఉరితీసిన ఇరాన్

హిజాబ్‌ వ్యతిరేక నిరసనల్లో  పాల్గొన్న  ఓ ఆందోళన కారుడిని ఇరాన్‌ ప్రభుత్వం ఉరితీసింది. సెక్యూరిటీ గార్డుని కత్తితో గాయపరచడంతో పాటు ఓ వీథిలో ఉద్రిక్తతలకు కారణమయ్యాడంటూ ఆరోపించింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనల అణిచివేతల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు స్థానిక మీడియా  తెలిపింది.
ఉరితీయబడిన వ్యక్తి మొహ్సెన్‌ షెకారీ (23)గా గా మీడియా పేర్కొంది. అతనికి సంబంధించిన ఇతర వివరాలు అందించలేదు. గత సెప్టెంబర్‌లో హిజాబ్‌ ధరించలేదన్న కారణంగా మోరాలిటీ పోలీసులు అరెస్ట్‌ చేసిన మాహ్సా అమ్ని అనే యువతి కస్టడీలో మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
రాజధాని టెహ్రాన్‌ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న  పలువురు ఆందోళనకారులకు ఇరాన్‌ లోని రెవల్యూషనరీ కోర్టు సోమవారం శిక్షలు విధించింది. బసిజి మిలీషియా సభ్యుడు రౌహొల్లా అజామియాన్‌ హత్య కేసులో అభియోగాలు మోపబడిన ఐదుగురికి మరణ శిక్ష విధించినట్లు న్యాయవ్యవస్థ ప్రతినిధి మసౌద్‌ సేతేషి మంగళవారం ప్రకటించారు.
సుమారు 21 మందికి మరణ శిక్షను విధించాలని ఇరాన్‌ అధికారులు కోరుతున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తెలిపింది. ఇరాన్‌ను కుదిపేసిన ప్రజా తిరుగుబాటులో పాల్గొన్న నిరసనకారులను బెదిరించేందుకు ప్రభుత్వం నకిలీ విచారణలు చేపట్టి శిక్షలు విధిస్తోందని మండిపడింది.
 ఇరాన్‌ ప్రభుత్వం తక్షణమే అన్ని ఉరి శిక్షలను రద్దు చేయాలని, శాంతియుత నిరసనలలో పాల్గొన్నందుకు అరెస్ట్‌ చేసిన ఆందోళనకారులపై ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. దేశ భద్రతకు, ఇస్లాం మత వ్యతిరేక శక్తులపై న్యాయవ్యవస్థ తీసుకుంటున్న కఠిన చర్యలపై అధికారులు ప్రశంసించడం గమనార్హం.