వివాహం ముందు శృంగారం నిషేధిస్తూ ఇండోనేషియాలో చట్టం

ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పెండ్లికి ముందు ఎవరైనా సరే శృంగారంలో పాల్గొంటే వారిని నేరం చేసిన వారిగా పరిగణిస్తారు. ఈ కొత్త చట్టాన్ని జకర్తాలో జరిగిన పార్లమెంటరీ ప్లీనరీ సమావేశంలో ఇండోనేషియా న్యాయశాఖ మంత్రి యసోన్నా లావోలీకి పార్లమెంటరీ కమిషన్‌ అధిపతి బాంబాంగ్‌ వుర్యాంటో అందించారు.
పెండ్లికి ముందు శృంగారాన్ని నిషేధించే బిల్లుపై ఇండోనేషియా పార్లమెంట్ సంతకం చేసింది. ఈ చట్టానికి ఆమోదంతో ఇప్పుడు ఇండోనేషియాలో వివాహానికి ముందు ఎవరితోనైనా శారీరక సంబంధం కలిగి ఉండటం చట్టవిరుద్ధం, నేరంగా పరిగణిస్తారు. ఈ కొత్త చట్టం ప్రకారం భార్య భర్తలు మాత్రమే శారీరక సంబంధం కలిగి ఉండాలి.

మరోవైపు, వివాహిత జంట తమ భాగస్వామితో కాకుండా మరొకరితో శారీరక సంబంధాలు పెట్టుకున్న పక్షంలో దాన్ని కూడా నేరం పరిధిలోకి వస్తుంది. వివాహిత జంట విషయంలో మహిళ లేదా పురుషుడు వారి భాగస్వామిపై కేసు నమోదు చేసినప్పుడు చర్యలుంటాయి. ఈ చట్టం ప్రకారం కోర్టులో విచారణకు ముందు ఫిర్యాదును ఉపసంహరించుకోవచ్చు.

అయితే విచారణ ప్రారంభమైన తర్వాత చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన సందర్భంగా పలువురు నిరసనకారులు పార్లమెంట్‌ వద్ద ప్రదర్శన నిర్వహించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.