దక్షిణ కొరియా సినిమాలు చూశారని బాలురలకు మరణశిక్ష

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి తన క్రూరత్వాన్ని చాటుకున్నారు. ఇద్దరు హైస్కూల్‌ విద్యార్థులకు మరణశిక్ష విధించారు. వారిని ప్రజల మధ్యే పోలీసులు కాల్చి చంపారు. ఇంతకీ ఆ విద్యార్థులు చేసిన తప్పేంటంటే.. పొరుగు దేశమైన దక్షిణ కొరియా సినిమాలు చూడటమే.
రేడియో ఫ్రీ ఆసియా నివేదిక ప్రకారం  ఉత్తర కొరియాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ర్యాంగ్‌ రాంగ్‌ ప్రావిన్స్‌కు వెళ్లారు, అక్కడ దక్షిణ కొరియా దేశానికి చెందిన సినమాలను, అమెరికన్‌ నాటకాన్ని చూశారు. వీటిని తోటి విద్యార్థులకు షేర్‌ చేశారు.

 దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకు పూనుకున్నది. వారిద్దరినీ ప్రజల మధ్య కాల్చి చంపాలని దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ పోలీసులను ఆదేశించాడు. ఈ ఇద్దరు విద్యార్థులు 15-16 ఏండ్ల వయసు వారు. వీరిద్దర్నీ హెసాన్‌ నగరంలో జనం చూస్తుండగానే బహిరంగంగా పోలీసులు కాల్చి చంపారు.

నిజానికి ఉత్తర కొరియా-దక్షిణ కొరియా దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నవి. దాంతో ఉత్తర కొరియా ప్రజలు దక్షిణ కొరియాలో జరిగే షోలు, సినిమాలను చూడలేకపోతున్నారు. ఈ ఘటన అక్టోబర్‌ నెలలో జరగ్గా  ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని బ్రిటిష్‌ పత్రిక ది ఇండిపెండెంట్‌ తన కథనంలో తెలిపింది.

కిమ్‌ జోంగ్ ఉన్న చేష్టలకు అక్కడి ప్రజలు ఎందరో బలవుతున్నారు. తన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ జయంతి సందర్భంగా తాను చెప్పినట్లు నడుచుకోలేదన్న కోపంతో వందలాది మందిని మైనస్‌ 15 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 30 నిమిషాలు నిలబెట్టి తన నియంత లక్షణాలను చాటుకున్నారు.