సీబీఐ కేసుల్లో అగ్రస్థానంలో ఏపీ 

సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదు చేసిన కేసులకు సంబంధించి వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభకు వెల్లడించింది. లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ 2017-21 అక్టోబరు నాటికి 56 కేసులు నమోదుకాగా.. వాటిలో 10 కేసులు ఒక్క ఏపీలోనే నమోదు అయినట్లు తెలిపారు.
 
ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన మొత్తం 56 కేసులకుగాను ఇప్పటి వరకు 22 కేసులలో చార్జిషీట్‌ దాఖలైందని  డీఓపీటీ  లోక్‌సభకు తెలిపింది.  డీఓపీటీ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 56 సీబీఐ కేసులలో అత్యధికంగా 10 కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత ఆరేసి కేసులతో ఉత్తరప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.

 సీబీఐ కేసుల్లో 2017లో 66.90 శాతం మందికి శిక్షలు పడ్డాయని మంత్రి చెప్పారు. 2018లో 68 శాతం, 2019లో 69.19 శాతం మందికి శిక్షలు పడగా, 2020లో 69.83 శాతం, 2021లో 67.56 శాతం.. మందికి శిక్షలు పడినట్లు డీఓపీటీ వెల్లడించింది. 

గత ఐదేళ్లలో ప్రజా ప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసుల్లో ఎక్కువ ఏపీలోనే నమోదైనట్లు పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తరువాతి స్థానాల్లో 6 కేసుల చొప్పున యూపీ, కేరళ ఉండగా.. అరుణాచల్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో ఒక్కోచోట ఐదు కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో 4 కేసులు కొత్తగా వచ్చినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.