పాక్ చొరబాటుదారుడిని చంపిన బిఎస్ఎఫ్ 

 
పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతాదళానికి చెందిన జవాన్‌లు హతమార్చారు. సోమవారం అర్ధరాత్రి రాజస్థాన్‌లోని శ్రీగంగనగర్‌ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పాకిస్థాన్‌ ఫెన్షింగ్ దాటి భారత ఫెన్షింగ్‌ వైపు చొరబాటుదారు రావడాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్‌లు గమనించారు.
వెంటనే అప్రమత్తమై అక్కడే ఆగిపోవాలని, అడుగు ముందుకు వేయొద్దని ఆ చొరబాటుదారుడిని జవాన్‌లు హెచ్చరించారు. అయితే, అతను వారి హెచ్చరికలను లెక్కచేయకుండా అలాగే ముందుకు రావడంతో కాల్చిచంపారు. అనంతరం ఘటనా ప్రాంతంలో వెతకగా చొరబాటుదారుడి మృతదేహం లభించింది. దీనిపై భారత్‌ సైనికులు పాకిస్థాన్‌ రేంజర్స్‌కు సమాచారం ఇచ్చారు.
అయితే, ఆ చొరబాటుదారు ఎవరో తమకు తెలియదని పాక్‌ రేంజర్స్‌ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన కోసం భారత జవాన్‌లు ఎదురు చేస్తున్నారు. మృతుడు తమ దేశ పౌరుడిగా పాకిస్థాన్‌ గుర్తిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని, లేదంగే ప్రొటోకాల్‌ ప్రకారం అంత్యక్రియలు చేస్తామని సైన్యం వెల్లడించింది.