ఢిల్లీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ

ఢిల్లీ మేయర్‌ పీఠాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్‌ 134 వార్డుల్లో గెలిచి మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది.  వరుసగా మూడు పర్యాయాలు మేయర్‌ పీఠం దక్కించుకున్న బిజెపి  ఇప్పుడు 104 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది.

ఇక కాంగ్రెస్‌ పార్టీ కేవలం తొమ్మిది వార్డుల్లో మాత్రమే గెలవగా  స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. ఢిల్లీ నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ఆప్‌ను గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఢిల్లీలో తమ ప్రభుత్వమే ఉన్నా, ఢిల్లీ కార్పోరేషన్‌ బిజెపి చేతిలో ఉండటంతో తమకు ఢిల్లీని క్లీన్‌ చేసే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఢిల్లీ ఓటర్లకు వివరించారు. ఎప్పుడైనా ఢిల్లీ పీఠంపై ఒక పార్టీ ఉంటే, ఢిల్లీ మేయర్‌ పీఠంపై మరో పార్టీ ఉంటూ వస్తున్నాయని, దాంతో సమన్వయం కొరవడి పారిశుద్ధ్యం పడకేస్తున్నదని ఆయన చెప్పారు. 

ఈసారి పాత సంప్రదాయాన్ని తిరగరాసి ఢిల్లీ మేయర్‌ పీఠాన్ని కూడా ఆప్‌కే కట్టబెట్టాలని కోరారు. కేజ్రివాల్ కోరినట్టుగానే ఢిల్లీ ఓటర్‌లు ఇప్పుడు ఆప్‌కు అధికారం కట్టబెట్టారు.

కాగా 1958లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 2012లో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేశారు. ఈ ఏడాది మే 22 నుంచి ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది. అయితే ఢిల్లీ మున్సిపల్ పీటంపై 15 ఏళ్లుగా బీజేపీనే అధికారంలో ఉంటుంది. 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 181 స్థానాల్లో విజయం సాధించగా.. ఆప్ 48 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగు లేని విజయం కైవసం చేసుకుంది.

ఢిల్లీ పౌర సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ  ఆశీస్సులతో పాటు బిజెపి, కాంగ్రెస్ సహకారం కావాలని ఆప్  కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచంలో భారత్ అగ్రదేశంగా ఎదిగేందుకు దేశంలో సానుకూల రాజకీయాలు ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పారు.