నేడే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుండి జరుగనున్నాయి.  నవంబర్‌‌‌‌‌‌‌‌లోనే శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉండగా గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా నెల రోజులు ఆలస్యంగా మొదలవుతున్నాయి. ఈ నెల 29 వరకు జరిగే సమావేశాలు మొదటి రోజున అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో చనిపోయిన సమాజ్‌‌‌‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌‌‌‌కు లోక్‌‌‌‌సభలో తొలి రోజున నివాళులర్పిస్తారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌‌‌‌ ధన్‌‌‌‌కర్  తొలిసారిగా రాజ్యసభ చైర్మన్ హోదాలో సభను నడపనున్నారు. ఈ నేపథ్యంలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ గౌరవార్ధం రాజ్యసభలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
 17 రోజుల పాటు సభ సమావేశం కానుండగా కేంద్ర ప్రభుత్వం 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. వీటితోపాటు పాతవి కూడా కలిపి మొత్తం 25 దాకా బిల్లులను ఆమోదింప చేయించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌‌‌‌లో కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషితోపాటు 30కి పైగా పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, భారత్–చైనా బార్డర్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ రూల్స్ ప్రకారం ఆయా అంశాలపై చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని బీజేడీ, జనాభా నియంత్రణ బిల్లును క్లియర్ చేయాలని శివసేన షిండే వర్గం కోరాయి. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను రాజ్‌‌‌‌నాథ్ సింగ్ కోరారు. సెషన్‌‌‌‌ లెజిస్లేటివ్ ఎజెండాను జోషి వివరించారు. బిల్లులు పాస్ చేయడంలో సహకరించాలని ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేశారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగం, భారత్ – చైనా సరిహద్దులోని పరిస్థితులపై సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ లోక్‌‌‌‌సభా పక్ష నేత ఆధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. కాశ్మీరీ పండిట్ల హత్యలపైనా చర్చ జరగాలని కోరారు. క్రిస్మస్ సందర్భంగా సెషన్ ఉండకుండా చూసుకోవాలని ఆధిర్ సూచించారు.
అయితే, సమావేశాలను కుదించాలని తాను చెప్పడం లేదని, అత్యవసరమైతే 25న కూడా సభను నిర్వహించవచ్చని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఇటీవలి ఎలక్షన్ కమిషనర్ నియామకంపై చర్చ జరపాలని కాంగ్రెస్ నేత నాసిర్ హుస్సేన్ కోరారు.  రాష్ట్రాలను ఆర్థికంగా దిగ్బంధించడంపై చర్చ జరగాలని టీఎంసీ నేతలు సుదీప్ బంద్యోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రెయిన్ డిమాండ్ చేశారు. సభలో ముఖ్యమైన అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించాలని కోరారు.
 దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఇతర పార్టీలు గొంతెత్తాయి. పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)పై చర్చ పెట్టాలని ఆప్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాల తర్వాత చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తామని జోషీ తెలిపారు.
కాగా, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, నేషనల్ నర్సింగ్, మిడ్‌‌‌‌వైఫరీ కమిషన్ బిల్లు, కంటోన్మెంట్ బిల్లు,  ఓల్డ్ గ్రాంట్(రెగ్యులేషన్) బిల్లు, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సవరణ) బిల్లు తదితరాలను కేంద్రం ప్రవేశపెట్టనుంది. అయితే బయోలాజికల్ డైవర్సిటీ (సవరణ) బిల్లు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్(సవరణ) బిల్లు, ఫారెస్ట్ కన్జర్వేషన్ (సవరణ) బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది. వీటిని స్టాండింగ్‌‌‌‌ కమిటీకి పంపాలని, వీటిపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నది.