వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌ ఇళ్లలో ఐటీ సోదాలు

విజయవాడలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,  వైఎస్‌ఆర్‌సిపి నేత దేవినేని అవినాష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు  తనిఖీలను నిర్వహిస్తున్నాయి.  ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
 
దాడుల వెనుక ఉన్న కారణం ఏమిటనే విషయంలో ఎలాంటి స్పష్టత  లేనప్పటికీ హైదరాబాద్ లో ఉన్న వంశీరామ్ రియలెస్టేట్ కంపెనీలో వీరు పెట్టుబడులు పెట్టారా? అనే కోణంలో దాడులు జరుగుతుండొచ్చని భావిస్తున్నారు. 
 
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు చెందిన స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. సోదాలు పూర్తయిన తర్వాతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
 
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో ఉదయం నుంచే సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.