దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకోనున్న తుఫాన్ ముప్పు 

తుపాన్‌ ముప్పు ముంచుకొస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ను ఆనుకుని అల్పపీడనం మరింత బలపడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

బుధవారం సాయంత్రానికి తుపాన్‌గా బలపడనున్న వాయుగుండం గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు- దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరకుంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈనెల 8 నుంచి 48 గంటలు ఉత్తర తమిళనాడు – దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు ఆనుకుని తుపాన్‌ కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.

దీని ప్రభావంతో ఈనెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు- దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తుపాన్‌ ప్రభావిత జిల్లాల యంత్రాగాన్ని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ తెలిపారు. దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.