మరొక విమాన వాహక నౌక తయారుపై పరిశీలన!

మన దేశంలో తయారైన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పని తీరు సంతృప్తికరంగా ఉండటంతో మరొకదానిని తయారు చేయాలని భారత నావికా దళం భావిస్తున్నది.  ప్రస్తుతం మన దేశంలో రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. అవి : రష్యన్ మేడ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, మన దేశంలో తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్.

డిసెంబరు 4న నావికా దళ దినోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఐఎన్ఎస్ విక్రాంత్ (ఐఏసీ-1) పని తీరు సంతృప్తికరంగా ఉందని, అందువల్ల ఐఏసీ-2 (స్వదేశీ విమాన వాహక నౌక)ను తయారు చేయించాలనే ప్రతిపాదనను నిలిపి ఉంచామని తెలిపారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ ట్రయల్ పెర్ఫార్మెన్స్ పట్ల నావికా దళం సంతృప్తి చెందినట్లు చెప్పారు. ఐఏసీ-2 కోసం ఈ దశలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పరిశీలనకు పంపించలేదని తెలిపారు. ఐఏసీ-1ను తయారు చేయడంలో కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్‌, ఇతర అనుబంధ పరిశ్రమలు సంపాదించిన అనుభవాన్ని ఉపయోగించుకుని మరొక విమాన వాహక నౌకను తయారు చేయడంపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఐఎన్ఎస్ విక్రాంత్‌ను మన దేశంలోనే తయారు చేయడంతో విమాన వాహక నౌకను స్వదేశంలో తయారు చేసే సామర్థ్యం గల చాలా తక్కువ దేశాల సరసన భారత దేశం కూడా చేరింది. దీనికన్నా పెద్ద నౌకను తయారు చేయాలని మొదట్లో ప్రతిపాదించారు.  దాదాపు 50 విమానాలను మోసుకెళ్ళే సామర్థ్యంతో, అత్యాధునిక కాటోబర్  (కెటాపల్ట్ అసిస్టెడ్ టేక్-ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ) మెకానిజం, న్యూక్లియర్ లేదా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సామర్థ్యంతో నిర్మించాలనే ప్రతిపాదన ఉంది.

అయితే నావికా దళం మళ్లీ ఐఎన్ఎస్ విక్రాంత్ సామర్థ్యంతోనే మరొక విమాన వాహక నౌకను తయారు చేయించాలనుకుంటే, అది కూడా దాదాపు 30 విమానాలను మోసుకెళ్ళే సామర్థ్యంతో, గ్యాస్ టర్బయిన్ ప్రొపల్షన్‌తో నిర్మితం కావచ్చు. అయితే ఈ రెండిటికి అయ్యే ఖర్చును పరిశీలించినపుడు కేవలం రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు వరకు తేడా ఉండవచ్చు.

నావికా దళం అధికారులు చెప్తున్నదాని ప్రకారం, మన దేశానికి మూడు విమాన వాహక నౌకలు ఉండాలి. ఒక నౌక రీఫిట్ జరుగుతున్న సమయంలో మిగిలిన రెండూ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. తూర్పు వైపున చైనాపై దృష్టి పెడుతూ ఒక నౌక, మరొకటి పశ్చిమ దిశలో ఉండాలి.

 నేవీలో మూడువేల మంది అగ్నివీర్ లు 

కాగా, నేవీలో ఇప్పటి వరకు మూడువేల మంది అగ్నివీర్ లను నియమించామని, వారిలో 341 మంది మహిళా  నావికులు ఉన్నారని అడ్మిరల్ ఆర్.హరి కుమార్ తెలిపారు.  2047 లోపు నేవీలో ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధి) సాధిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఆత్మనిర్భర్ పై కేంద్రం ఇదివరకే తమకు గైడ్ లైన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. 

హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఎప్పటికపుడు చైనా మిలటరీ, దాని నౌకల కదలికలపై నిఘా వేసి ఉంచామని వెల్లడించారు. ‘‘ఇండియన్ ఓషియన్ ప్రాంతం (ఐవోఆర్) లో చైనాకు చెందిన చాలా షిప్ లు విధులు నిర్వహిస్తున్నాయి.వాటిలో 46 పీపుల్స్  లిబరేషన్  ఆర్మీవి కాగా, మరికొన్ని రీసర్చ్ షిప్​లు.  ఈ నేపథ్యంలో ఐవోఆర్​లో అదనపు బలగాలను మోహరిస్తున్నాం” అని వివరించారు. 

ఈ ప్రాంతం రవాణాకు కీలకమన్న విషయం తమకు తెలుసని అంటూ  ఈ ప్రాంతంలో మన దేశ ప్రయోజనాలు కాపాడడం, ప్రమోట్  చేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.  తీర ప్రాంత రక్షణ విషయంలో యుద్ధ సన్నద్ధతపై తమకు స్పష్టత ఉందని ఆయన పేర్కొన్నారు. 

ఇక ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై మాట్లాడుతూ.. రక్షణ అవసరాల కోసం ప్రపంచంపై ఆధారపడలేమని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో మన దేశ నేవీ సత్తా పెరిగిందని, తీర ప్రాంత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఎయిర్ క్రాఫ్ట్  క్యారియర్ ఐఎన్ఎస్  విక్రాంత్ ను నేవీలో ప్రవేశపెట్టడం మైలురాయి అని పేర్కొన్నారు.