‘దేశ భాషలందు తెలుగు లెస్స’ కొనియాడిన రాష్ట్రపతి ముర్ము

దేశ ప్రజలందరికీ తెలుగు భాష, సాహిత్యం సుపరిచితమని పేర్కొంటూ ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో ప్రతిష్టలకు నెలవు అని చెప్పారు. ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. 

రాష్ట్రపతిని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సత్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము . ‘అందరికీ నమస్కారం, మీ అభిమానానికి ధన్యవాదాలు’ అని తెలుగులో మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనం దేశం మొత్తానికీ తెలుసని తెలిపారు. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర స్థలానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండే ఈ నేలపై అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. నాగార్జునుడు అమరావతిలో చేసిన బోధనలు చలా గొప్పవని, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి గతంలో ఏపీ నుంచి రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరిని మనం ఇప్పుడు గౌరవించుకుంటున్నామని, గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం ఇప్పటికీ అభిమానాన్ని పొందుతోందని చెప్పారు. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షిస్తున్నానని ద్రౌపదీ ముర్ము తెలిపారు. 

దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఏపీ కోడలని, సరోజినీ నాయుడు ఇక్కడి నుంచే వచ్చారని చెబుతూ సర్వేపల్లి రాధా కృష్ణ చెప్పిన వ్యాఖ్యలు ఈ సందర్బంగా రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన బిర్సా ముండా వంటి వారిని ఈ తరం గుర్తు ఉంచుకోవాలని ఆమె సూచించారు. అంతరిక్షం విఙ్ఞానంలో ఇస్రోలో తెలుగు వారి సేవలు దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు.

దేశ చరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రపతి పదవిలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ద్రౌపది ముర్మును గౌరవించుకోవడం మనందరి బాధ్యతగా భావించి పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా అణగారిన వర్గాల ప్రజల కోసం ఆమె కృషి చేశారని కొనియాడారు. జీవితంలో ద్రౌపది ముర్ము పడిన కష్టాలు.. వాటిని చిరునవ్వుతో స్వీకరించి ముందుకు సాగిన తీరు దేశంలోని ప్రతి మహిళకూ ఆదర్శమని తెలిపారు.

పోరంకిలో పౌరసన్మాన కార్యక్రమం అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతిని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ స్వాగతం పలికారు. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ అధికారిక విందు ఇచ్చారు.