ఇరాన్ లో `నైతిక పోలీసు విభాగం’ రద్దు

మోర‌ల్ పోలీసింగ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డుతుండ‌డంతో ఇరాన్ ప్ర‌భుత్వం దిగొచ్చింది. మోర‌ల్ పోలీసింగ్‌ను నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని ఆ దేశ అటార్నీ జ‌న‌ర‌ల్ మొహ‌మ్మ‌ద్ జాఫ‌ర్ మొంత‌జెరి ఆదివారం  వెల్ల‌డించాడు. ఇరాన్ పార్ల‌మెంట్‌, న్యాయ వ్య‌వ‌స్థ కూడా ఏండ్ల నాటి హిజాబ్ చ‌ట్టాన్ని ప‌రిశీలిస్తున్నాయని, ఈ చ‌ట్టానికి మార్పులు చేయాల్సిన అవ‌సరం ఉందా? అనే విష‌య‌మై ఆలోచిస్తున్నాయ‌ని ఆయ‌న తెలిపాడు. దాంతో, దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

నైతిక పోలీస్‌ విభాగం  రద్దు చేయబడిందని, న్యాయవ్యవస్థకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని అటార్నీ జనరల్‌ మొహమ్మద్‌ జాఫర్‌ పేర్కొన్నట్లు మీడియా తెలిపింది. మతపరమైన సమావేశంలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చినట్లు వివరిచింది. 

హిజాబ్‌ చట్టంలో మార్పులు రావాలా వద్దా అనే సమస్యపై పార్లమెంట్‌, న్యాయవ్యవస్థ రెండూ చర్చిస్తున్నాయని ప్రకటించిన మరుసటి రోజు ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 22 ఏళ్ల కుర్దిష్ మ‌హిళ మ‌హిసా అమిని మోర‌ల్ పోలీసుల క‌స్ట‌డీలో చ‌నిపోవ‌డంతో హిజాబ్ వివాదం రాజుకుంది. ఆమె మ‌ర‌ణ వార్త తెలిసి ఆగ్ర‌హించిన‌ ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో నిర‌స‌న‌కు దిగారు. మ‌హిసా అమిని ఫొటో, ప్ల‌కార్డులు ప‌ట్టుకొని రోడ్ల మీదికి వ‌చ్చారు.

మోర‌ల్ పోలిసింగ్‌ను నిర‌సిస్తూ కొంద‌రు మ‌హిళ‌లు జుట్టు క‌త్తిరించుకున్నారు. ఆ వీడియోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు కొంద‌రు హిజాబ్ లేకుండానే బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిరిగారు. ఆ దేశ ఫుట్‌బాల్ ఆట‌గాళ్లు, అథ్లెట్లు ప్ర‌పంచ వేదిక మీద‌ నిర‌స‌నకారుల‌కు సంఘీభావం తెలియ‌జేశారు.

దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రెండు నెలలుగా రాజధాని టెహ్రాన్ సహా పలు చోట్ల నిరసనలు  కొనసాగుతున్నాయి.  ఆందోళనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి.   దీంతో ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో  నిరసనకారులపై బలగాలు కాల్పులకు దిగాయి.   ఆందోళనలను కర్కశంగా అణచివేస్తున్నాయి.   

మోరాలిటీ పోలీసు విభాగాన్ని అధికారికంగా గాష్ట్‌-ఇ- ఎర్షాద్‌ లేదా గైడెన్స్‌ పెట్రోల్‌ అని పిలుస్తారు. హిజాబ్‌ సంస్కృతిని వ్యాప్తి చేయడానికి అధ్యక్షుడు మహమూద్‌ అహ్మదీ నెజాద్‌ ఆధ్వర్యంలో ఈ విభాగం  ప్రారంభించబడింది. 2006 నుండి ఇవి గస్తీ ప్రారంభించాయి.   మహిళలు హిజాబ్‌ లేదా హెడ్‌స్కార్ఫ్‌ ధరించాలంటూ ఇబ్రహీం రైసీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేస్తుంది. 

హిజాబ్ స‌రిగా ధ‌రించ‌లేద‌నే కార‌ణంతో మ‌హిసాను సెప్టెంబ‌ర్ 20వ తేదీన మోర‌ల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వాళ్ల క‌స్ట‌డీలో చ‌నిపోయింది. దాంతో ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 నెల‌లుగా హిజాబ్, మోర‌ల్ పోలీసింగ్‌ వ్య‌తిరేక నినాదాలు, నిర‌స‌న‌ల‌తో ఇరాన్ అట్టుడుకుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల కారణంగా దాదాపు 300 మంది పౌరులు చ‌నిపోయారు. ఇరాన్‌లో 1979 విప్ల‌వం త‌ర్వాత ఈ స్థాయిలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెర‌గ‌డం ఇదే మొద‌టిసారి. ఈ నేప‌థ్యంలో ఇరాన్ ప్ర‌భుత్వం మోర‌ల్ పోలీసింగ్‌ను నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.