పార్లమెంట్‌ చేసిన చట్టాలను సుప్రీం’ ఎలా కొట్టేస్తుంది?

పార్లమెంటులో ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత దానిని సుప్రీం కోర్టులో ఎలా రద్దు చేస్తారని  ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ప్రశ్నించారు.  చట్టాలను రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ఆయన     సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సమక్షంలోనే నిలదీశారు. నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ యాక్ట్‌-2014 (ఎన్‌జాక్‌)ను రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం 2015లో ఇచ్చిన తీర్పును ఉపరాష్ట్రపతి తప్పుబట్టారు.

ఢిల్లీలో డాక్టర్‌ ఎల్‌ఎం సింఘ్వీ 8వ స్మారకోపన్యాస కార్యక్రమంలో ధన్‌కర్‌తోపాటు సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, మాజీ సీజేఐ జస్టిస్‌ ఆర్‌ఎం లోథా, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌, మాజీ కేంద్రమంత్రి చిదంబరం, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. సింఘ్వీ స్మారకోపన్యాసం ఇచ్చిన ఉప రాష్ట్రపతి ఎన్‌జాక్‌ రద్దు తీర్పును తీవ్రంగా విమర్శించారు.

“2015-16లో పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దానిని లోక్‌సభ, రాజ్యసభ ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండా ఏకగ్రీవంగా ఆమోదించాయి. విస్తృత ప్రజాభిప్రాయానికి ప్రతీక అయిన ఆ చట్టం రాజ్యాంగ నిబంధన అయ్యింది. కానీ, దానిని న్యాయస్థానం కొట్టేసింది” అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనను ప్రపంచం ఎన్నడూ చూడలేదని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 

చట్టంతో ముడి ఉన్న అంశాన్ని కోర్టులు తమ పరిశీలనకు స్వీకరించవచ్చునన్న ఆయన.. ఆ పేరిట మొత్తం అంశాన్నే తోసివేయవచ్చునని రాజ్యాంగంలోని ఏ నిబంధనలోనూ పేర్కొనలేదని ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన నిబంధనలను కాదనే సమాంతర వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా అనేది సమున్నత న్యాయకోవిదులు, ఆలోచనాపరులతో నిండిన ఈ వేదిక యోచించాలని ఆయన కోరారు.

“పరిపాలనలో కీలకమైన సంస్థలలో ఒకటిగా ఉన్న మన న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక లేదా శాసనసభ వ్యవస్థ వంటిది కాదు. అధికార విభజన సిద్ధాంతం మన పాలనకు ప్రాథమికమైనది. ఏదైనా చొరబాటు, ఎంత సూక్ష్మమైనప్పటికీ, మరొకరి డొమైన్‌లో ఒకరి పరిపాలనను  అస్థిరపరిచే  సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది” అని హెచ్చరించారు.

ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించేలా పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన రాజ్యాంగ సవరణలను న్యాయస్థానాలు తోసిపుచ్చిన కొన్ని సందర్భాలను ప్రస్తావిస్తూ, “అధికారం ‘మనం ప్రజలు’ ప్రకటనలో ఉంటుంది – వారి ఆదేశం, వారి విజ్ఞత… అయితే అటువంటి శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ప్రజల శాసనాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళే రాజ్యాంగ నిబంధన రద్దు చేయబడింది, ఏమి జరుగుతుంది?” అంటూ ప్రశ్నించారు.

ఇవి పక్షపాత కోణంలో  చూడకూడని అంశాలని ఉపరాష్ట్రపతి అందరికీ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ సందర్భానికి ఎదగాలని, భారతదేశపు వృద్ధి కథలో భాగం కావాలని సూచించారు. కాగా, కొలీజియం, ఎన్‌జేఏసీ చట్టంపై దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే రాజ్యాంగ దినోత్సవం నాడు జగదీప్‌ వ్యక్తం చేశారు.  జగదీప్‌ రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులో పనిచేయడం గమనార్హం.