హెచ్‌సీయూలో థాయ్‌లాండ్‌ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం

హైదరాబాద్‌ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీలో ఓ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం కలకలం రేపుతోంది. థాయ్ లాండ్ నుంచి ఇటీవలే వచ్చిన విద్యార్థినికి హిందీ నేర్పిస్తానంటూ ప్రొఫెసర్ రవిరంజన్ నమ్మించాడు. బేసిక్స్ నేర్పించే బుక్ కోసం ఇంటికి రమ్మంటూ బాధితురాలిని తన కారులోనే తీసుకెళ్లాడు. 
 
 బాధితురాలు నేరుగా వచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో వర్సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బాధితురాలికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ఇంటికి వెళ్లాక అసభ్యంగా ప్రవర్తించాడని థాయ్ లాండ్ విద్యార్థిని పోలీసులకు తెలిపింది.
 
మద్యం ఆఫర్ చేసి అసభ్యంగా తాకడంతో తాను ప్రతిఘటించానని పేర్కొంది. దీంతో ప్రొఫెసర్ తనపై దాడి చేశాడని, ఆపై తన కారులోనే తీసుకొచ్చి యూనివర్శిటీ గేటు ముందు వదిలి వెళ్లాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
 
హెచ్‌సీయూకి చెందిన థాయిలాండ్ విద్యార్థిని తెల్లవారుజామున 3 గంటలకు ఫిర్యాదు చేసిందని గచ్చిబౌలి ఏసీపీ రఘునందన్ తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని చెప్పారు. గత రాత్రి యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ ను ప్రొఫెసర్ రవి రంజన్ కారులో తన ఇంటికి తీసుకెళ్లాడని పేర్కొన్నారు. 
 
కూల్ డ్రింక్ లో ఆల్కహాల్ కలిపి ఇచ్చాడన్న ఏసీపీ, ఆపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు.  యువతి నిరాకరించడంతో ఆమెని కొట్టాడని, రవి రంజన్ ఆమెను కారులో తీసుకొచ్చి హాస్టల్ వద్ద దింపాడని చెప్పారు.
 
 అమ్మాయి తన తోటి విద్యార్థులకు విషయం చెప్పి, వారితో కలిసి గచ్చిబౌలి పీఎస్ కి వెళ్లి ఫిర్యాదు చేసిందని చెప్పారు. ప్రొఫెసర్ రవి రంజన్ ని అదుపులోకి తీసుకున్నామని, 353, 354-A కింద కేసు నమోదు చేశామని ఏసీపీ రఘునందన్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షలకు పంపించినట్లు చెప్పారు. 
 
మరోవైపు, ప్రొఫెసర్ రవిరంజన్ ను సస్పెండ్ చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కాగా, ప్రొఫెసర్ రవిరంజన్ ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు.  క్యాంపస్ లోపల ఎలాంటి ఘటనలు జరిగినా విచారించేందుకు వర్శిటీ తరఫున ఒక కమిటీ ఉండగా, ప్రొఫెసర్ రవి రంజన్ వేధింపులకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులను ఆ కమిటీ విచారిస్తోందని తెలిపారు.

ఆ కేసులలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇప్పుడు ఈ ఘటనకు అవకాశం కల్పించినట్టయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రొఫెసర్ రవిరంజన్ ను శాశ్వతంగా వర్శిటీ నుంచి పంపేయాలనే డిమాండ్ తో క్యాంపస్ లో ఏబీవీపీ, పలు విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు. దీంతో రవిరంజన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు రిజిష్టర్ ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో లిఖిత పూర్వకంగా చూపిస్తేనే.. ఆందోళన విరమిస్తామని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. రవిరంజన్ లాంటి కీచక ప్రొఫెసర్లు మరికొందరు ఉన్నారని..ఇప్పటికే వాళ్లపై పలుమార్లు ఫిర్యాదు చేశామన్న విద్యార్థులు.. వారి సంగతేంటని ప్రశ్నించారు. దీంతో ప్రొఫెసర్ రవిరంజన్ ని సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ లిఖితపూర్వకంగా తెలిపారు. బాధిత యువతికి యూనివర్సిటీ తరపున అండగా ఉంటామని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులు ఆందోళన విరమించారు.