పాక్‌ రాయబారిపై కాబూల్‌లో హత్యాయత్నంతో మిషన్ మూసివేత!

తాలిబన్‌ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్‌ రాయబారి ఉబైద్ ఉర్ రెహ్మాన్ నిజామనిపై హత్యాయత్నం జరిగింది. అయితే భద్రతా సిబ్బందిని ఆయనను కాపాడారు. ఈ క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డుకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఈ సంఘటనతో దిగ్బ్రాంతి చెందిన పాకిస్థాన్ ప్రభుత్వం కాబుల్ లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, తమ రాయబారిపై దాడిని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాక్‌ రాయబారి ప్రాణాలను కాపాడిన సెక్యూరిటీ గార్డు వీరత్వాన్ని కొనియాడారు.
రాయబారిని కాపాడే ప్రయత్నంలో కాల్పుల్లో గాయపడిన ఆ సెక్యూరిటీ గార్డు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ట్వీట్‌ చేశారు. ఒక దుండగుడు ఇళ్ల చాటున  తుపాకీతో రాయబార కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దులో ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో దీనిని నివారించి ఇరు దేశాల మధ్య సఖ్యతను పెంపొందించేందుకు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఇటీవల కాబూల్‌లో పర్యటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే కాబుల్‌లోని పాకిస్థాన్‌ రాయబారిపై హత్యాయత్నం జరిగింది. అయితే ఆయన ప్రాణాలతో బయటపడినట్లు పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. తమ దేశ రాయబారిపై దాడిని ఆయన ఖండించారు.
 
కాగా, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ తమ రాయబార కార్యాలయంపై దాడులను తాలిబన్ ప్రభుత్వం సహింపరాదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వెంటనే లోతయిన దర్యాప్తు జరిపించి, నిందితులను గుర్తించి, చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేసింది.