23 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్ల నిషేధం 

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం, మెటాకు చెందిన వాట్సాప్  అక్టోబర్ ఒక్క నెలలోనే ఏకంగా 23 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. ఈ మేరకు అక్టోబర్ నెలకు సంబంధించిన నివేదికలో వెల్లడించింది ఈ మెటా ప్లాట్‌ఫాం. 
 
ఈ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మొత్తంగా 23,24,000 వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. ఇందులో మళ్లీ 8,11,000 వాట్సాప్ ఖాతాలను వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుకోకముందే.. ముందుజాగ్రత్తగా తామే తొలగించినట్లు 
 
ఐటీ రూల్స్ 2021 ప్రకారం  తాము ఈ చర్యలు తీసుకొని నివేదిక సమర్పించినట్లు వాట్సాప్ వెల్లడించింది. అంతకుముందు సెప్టెంబర్ నెలలో ఇప్పటి కంటే ఎక్కువగా 26 లక్షల భారతీయ అకౌంట్లను తొలగించింది. అక్టోబర్ నెలకు సంబంధించి వాట్సాప్ 701 గ్రీవెన్స్ రిపోర్ట్స్‌ను అందుకుంది. 
 
వీటిపై ఫిర్యాదులు అందగా 34 అకౌంట్లపై నేరుగా వాట్సాప్ చర్యలు తీసుకుంది. ఈ గ్రీవెన్స్ రిపోర్ట్స్‌‌లో 550 ఫిర్యాదులు వాటిని నిషేధించాలని  రాగా, మిగతావి సపోర్ట్, సేఫ్టీకి సంబంధించినవి అని తన నెలవారీ రిపోర్ట్‌లో వాట్సాప్ వివరించింది.
 
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐటీకి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం,  భారత్‌లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తమ నెలవారీ నివేదికలను ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో,  అప్పటి నుంచి ఇవి నకిలీ, స్పామ్, తప్పుడు అకౌంట్లపై కొరఢా ఝుళిపిస్తున్నాయి. నెలకు లక్షల్లో వాట్సాప్ ఖాతాల్ని నిషేధిస్తూ ఉండటం విశేషం. ఐటీ చట్టానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది.
 
” ఐటి రూల్స్ 2021 ప్రకారం 2022 అక్టోబర్‌ నెలకు సంబంధించి నెలవారీ రిపోర్ట్ అందించాం. ఈ యూజర్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు మాకు అందాయి? వాటిపై మేం ఏయే చర్యలు తీసుకున్నామనే వివరాలు పొందుపరిచాం. ఇంకా కొన్ని ఫిర్యాదులు అందకముందు వాట్సాప్ ముందస్తుగా చాలా అకౌంట్లను తొలగించింది.” అని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.
 
జులై, ఆగస్టు నెలల్లోనూ పెద్ద ఎత్తున తప్పుడు అకౌంట్లపై వాట్సాప్ చర్యలు తీసుకుంది. వాట్సాప్‌లో హానికర కంటెంట్ వ్యాప్తి చెందకుండా, ఇక యూజర్ల సేఫ్టీకి సంబంధించి వాట్సాప్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వాట్సాప్ దీనిని అరికట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందుకుంటూ త్వరితగతిన పరిష్కరించేందుకు చూస్తోంది.