పంజాబ్ సీఎం నివాసం వద్ద వ్యవసాయ కూలీలపై లాఠీలు 

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సొంత ఊర్లోని నివాసం వద్ద వ్యవసాయ కూలీలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆయన ఇంటి వైపు వారు దూసుకొస్తుండగా పోలీసులు లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఈ సంఘటన జరిగింది. 
ఎనిమిది కార్మిక సంఘాలు కలిసి సంయుక్త ఫ్రంట్ సంఝా మజ్దూర్ మోర్చాగా ఏర్పడ్డాయి.
బుధవారం ఉదయం సంగ్రూర్‌లోని పాటియాలా, బటిండా రహదారి సమీపంలో వందలాది మంది వ్యవసాయ కూలీలు తరలివచ్చి నిరసనకు దిగారు.  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కనీస రోజువారీ వేతనాన్ని రూ.700కు పెంచాలని, దళితుల కోసం ప్లాట్ల పథకాన్ని అమలు చేయాలని, ఉమ్మడి పంచాయితీ భూమిలో మూడో భాగాన్ని తమ సమాజానికి లీజుకు కేటాయించాలని వ్యవసాయ కూలీలు డిమాండ్ చేశారు.
కాగా, నిరసన చేస్తున్న వ్యవసాయ కూలీలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంగ్రూర్‌లోని సీఎం భగవంత్‌ మాన్‌ అద్దె నివాసం వైపు కవాతు నిర్వహించారు. దీంతో అడ్డుకున్న పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు.
అయితే తమతో సమావేశానికి తొలుత అంగీకరించిన సీఎం భగవంత్‌ మాన్‌ ఆ తర్వాత నిరాకరించారని, దీంతో తమ డిమాండ్ల కోసం నిరసనకు దిగినట్లు జమీన్ ప్రాప్తి సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు ముఖేష్ మాలౌద్ తెలిపారు. కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు చెందిన సీఎం భగవంత్ మాన్ పరిపాలనను వదిలివేసి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.