న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం పరిష్కారం కాదు

పెండింగ్‌ కేసుల విచారణ కోసం న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం పరిష్కారం కాదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఇటువంటి ప్రజావాద, సరళమైన చర్యలు పరిష్కారం కావని స్పష్టం చేసింది.
 
 పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించేందుకు సబార్డినేట్‌ జ్యుడీషియరీ, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేయాలని కేంద్రం, అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 
 
ఎక్కువ మంది న్యాయమూర్తులను చేర్చుకోవడం సమాధానం కాదని, సమర్థవంతమైన వారు ఉండటం అవసరమని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహలతో కూడిన ద్విసభ్య దర్మాసనం వ్యాఖ్యానించింది. అలహాబాద్‌లో 160 మంది న్యాయమూర్తులను నియమించడమే కష్టంగా ఉండగా.. మీరు రెట్టింపు అంటే 320 మందిని కోరుతున్నారని ధర్మాసనం పేర్కొంది.
 
 ” మీరు బాంబే హైకోర్టుకు వెళ్లారా .. అక్కడ మౌలిక సదుపాయాలు లేనందున ఒక్క న్యాయమూర్తిని కూడా నియమించలేని పరిస్థితి ” అని సిజెఐ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.  న్యాయమూర్తులు, జనాభా నిష్పత్తి భారత్‌లో కంటే అమెరికాలో మెరుగ్గా ఉందని పిల్‌ను దాఖలు చేసిన న్యాయమూర్తి అశ్వనీ ఉపాధ్యాయ పేర్కొన్నారు. 
 
ఇటువంటి పిటిషన్‌లపై అమెరికా, బ్రిటన్‌ సుప్రీంకోర్టులు విచారణకు కూడా స్వీకరించవని, న్యాయవాదుల వాదనను కూడా అమెరికా సుప్రీంకోర్టు వినదని, కానీ మన భారత వ్యవస్థ దానికి విరుద్ధమని పేర్కొంది.