ఢిల్లీలో నెలలో మూడోసారి భూప్రకంపనలు

మంగళవారం రాత్రి ఢిల్లీకి దగ్గర్లో చిన్న భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది, రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 2.5గా నమోదైంది. ఢిల్లీకి పశ్చిమంగా 8 కిలోమీటర్ల దూరంలో.. రాత్రి 9.30కి భూకంపం వచ్చినట్లు తెలిసింది. దీని వల్ల ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. అలాగే నోయిడా, ఘజియాబాద్‌లో కూడా చిన్నగా ప్రకంపనలు వచ్చాయి.

ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలానికి 5 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. సాధారణంగా తీవ్రత 4 కంటే తక్కువగా ఉంటే వాటిని చిన్న భూకంపాలుగా పరిగణిస్తారు. అంటే వాటివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే జనావాసాలకు దూరంగా భూమి కంపించడంతో నగరంలో దీని ప్రభావం పెద్దగా కనిపించలేదని తెలిపారు.

కాకపోతే ఈ నెలలో ఢిల్లీలో మూడోసారి భూమి కంపించింది. ఇది ఆందోళనకర అంశం. చిన్న చిన్న కదలికల తర్వాత ఒకేసారి పెద్ద భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈమధ్యే నేపాల్, ఇండొనేసియాలో భారీ భూకంపాలు వచ్చాయి. వాటి వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం జరిగింది.  నవంబర్ 9న పశ్చిమ నేపాల్‌లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల ఆరుగురు చనిపోగా.. కొన్ని ఇళ్లు నాశనమయ్యాయి. నవంబర్ 21 ఇండొనేసియా.. దీవి జావాలో వచ్చిన భూకంపం వల్ల 268 మంది చనిపోగా.. వందల మంది గాయాలపాలయ్యారు. చాలా ఇళ్లు కూలిపోయాయి

ప్రధానంగా హిమాలయ పలకాల్లో భారీ కదలికలు కంటిన్యూగా జరుగుతున్నాయి. అందువల్ల హిమాలయాల పరిసర ప్రాంతాల్లో తరచూ భూకంపాలు వస్తున్నాయి. ఆ ప్రభావం రాజధాని ఢిల్లీపై పడుతోంది. భూకంపం వచ్చిన ప్రతిసారీ ఉత్తర భారత దేశ ప్రజలు ఉలిక్కిపడే పరిస్థితి ఉంటుంది. అప్రమత్తంగా ఉండటమే మనం చేయగలిగింది అని నిపుణులు చెబుతున్నారు. ప్రకంపనలు వచ్చినప్పుడు ఇళ్లలో ఉండకుండా.. ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.