ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్.జవహర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ బుధవారం రిటైర్ అవుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కేఎస్.జవహర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
 
1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్  ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు టిటిడి ఇఓగా బాధ్యతలు నిర్వహించారు.
 
వైస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి… ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బదిలీ అయ్యారు. అంతకుముందు పలు కీలక శాఖల్లోనూ ఆయన పని చేశారు. ఈ పదవి కోసం పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ, చివరకు జవహర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది.
 
కొత్త సీఎస్‌గా ఎంపికైన జవహర్ రెడ్డి 2024 జూన్ వరకు పదవిలో ఉండే అవకాశం ఉంది. ఇక కొత్త సీఎస్ నియామకంతోపాటు పలువురు ఐఏఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జవహర్ రెడ్డి స్థానంలో సీఎం ముఖ్య కార్యదర్శిగా పూనం మాలకొండయ్యను ఎంపిక చేశారు.  వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూధన్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ఆండ్‌బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహమ్మద్ దివాన్ నియమితులయ్యారు.
 
మూడేళ్లపాటు పూర్తికాలం కాలుష్యనియంత్రణ మండలి చైర్మన్‌గా సమీర్‌శర్మ కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో-80) జారీ చేసింది. దానితో పాటు ముఖ్యమంత్రి జగన్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కూడా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.ఈ కీలక పదవిని ప్రత్యేకంగా సృష్టించడం గమనార్హం.