రిటైల్‌ డిజిటల్‌ రూపీ రేపటి నుండే

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గురువారం నుంచి రిటైల్‌ డిజిటల్‌ రూపీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించనుంది. తొలుత ఎంపిక చేసిన ముంబయి, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ నగరాల్లో ఇ-రూపాయిని అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్‌బిఐ పేర్కొంది.  సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సిబిడిసి)గా వ్యవహరించే ఈ డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌లో ఆ కరెన్సీ సష్టి, పంపిణీ, రిటైల్‌ వినియోగం మొత్తం ప్రక్రియను నిశితంగా పరిశీలించనున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది. అనంతరం రిటైల్‌ డిజిటల్‌ రూపాయిలో చేయాల్సిన మార్పులపై దృష్టి సారించనుంది.

ఆ తర్వాత అహ్మదాబాద్‌, గ్యాంగ్‌టక్‌, గౌహతి, హైదరాబాద్‌, ఇండోర్‌, కొచ్చి, లక్నో, పట్నా, సిమ్లాలకు విస్తరించనున్నట్లు ఆర్‌బిఐ వెల్లడించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కోసం 8 బ్యాంకులను ఆర్‌బిఐ ఎంపిక చేసింది. తొలి దశ దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌లు ఈ సేవలను అందించనున్నాయి.

ఆ తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌తో సహా మరో నాలుగు బ్యాంకులు ఈ పైలట్‌ ప్రాజెక్టులో చేరనున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేసిన ప్రదేశాలలో వినియోగదారులు, వ్యాపారుల మధ్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు.

ఇ-రూపాయి బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారు. వినియోగదారులు దీన్ని మొబైల్‌ ఫోన్లలోని డిజిటల్‌ వాలెట్లలో ఉంచుకోవచ్చు. ఈ డిజిటల్‌ వాలెట్ల ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి లేదా వ్యక్తి నుంచి వ్యాపారికి లావాదేవీలు జరుగుతాయి. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా చెల్లింపులు జరుపవచ్చు. ఇ-రూపాయిని డబ్బు రూపంలోకి కూడా మార్చుకునే వీలు కల్పించారు.

ఇ-రూపాయి విలువ ప్రస్తుతం ఉన్న కరెన్సీకి సమానంగానే ఉంటుంది. ఇ-రూపాయి అందుబాటుతో జేబులో నగదు ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు ఖాతాలో ఉంచుకోవాలనే ఒత్తిడి ఉండదు. దీంతో నగదు రహిత చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇ-రూపాయి అందుబాటులోకి రావడంతో నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. భౌతిక రూపాయి ముద్రణ ఖర్చు కూడా తగ్గుతుందని ఆర్‌బిఐ పేర్కొంటుంది. దీన్ని తొలుత నవంబర్‌ 1 నుంచి ఎంపిక చేసిన టోకు అవసరాలకు వినియోగించేలా పైలట్‌ ప్రాజెక్టును చేపట్టారు.