
ఎన్డీటీవీ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ప్రణయ్ రాయ్ భార్య రాధికా రాయ్ కూడా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్డీటీవీలో మెజారిటీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది.
ఎన్‌డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు. దాంతో ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
మొత్తంగా ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ గ్రూప్ 55.18 శాతం వాటా దక్కించుకుంది. ఎన్డీటీవీ యాజమాన్యపు హక్కు సొంతం చేసుకునేందుకు ఈ మాత్రం వాటా సరిపోతుంది. దీంతో, ఎన్డీటీవీ అదానీ గ్రూప్ సొంతమైంది. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేయడంతో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్‌లను కొత్త డైరెక్టర్లుగా నియమించారు.
ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానల్ ‘న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్’లో (ఎన్‌డీటీవీ) మెజారిటీ వాటాను చేజిక్కించుకోవడం ద్వారా అదానీ గ్రూప్ తాజాగా వార్తా ప్రసార మాధ్యమ రంగంలోకీ ప్రవేశించిన్నట్లయింది. ఎన్‌డీటీవీ కొనుగోలుతో తన ప్రధాన వ్యాపార ప్రత్యర్థి ముకేశ్ అంబానీతో పోటీని అదానీ మరో మెట్టెక్కించారు. అంబానీ చాలాకాలంగా న్యూస్ చానళ్ల విభాగంలో ఉన్నారు. ఆయన యాజమాన్యంలోని నెట్‌వర్క్ 18 సంస్థ సీఎన్‌ఎన్-న్యూ్‌స 18, సీఎన్‌బీసీ-టీవీ 18 వంటి వార్తా చానళ్లను నిర్వహిస్తోంది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి
ప్రపంచ వృద్ధిని దెబ్బ తీస్తున్న ట్రంప్ విధానాలు