భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ రూపీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బీఐ) డిజిటల్ రుపీ పైలట్ ప్రాజెక్ట్‌ను నవంబర్ 1న ప్రారంభించగా, ఆర్‌బీఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) మొదట హోల్‌సేల్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రీటైల్ సెగ్మెంట్‌లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ (ఇ-ఆర్) పైలట్ ప్రాజెక్ట్ ను  గురువారం ప్రారంభించింది. 
 
 ఎంపిక చేసిన వ్యాపారులు, కస్టమర్లు మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఉంటారు. కరెన్సీ నోట్ల లాగానే ఇ -ఆర్ కూడా చట్టబద్ధంగా చెల్లుతుంది. డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. ప్రస్తుతం కాగితం కరెన్సీ, నాణేలు ఏ డినామినేషన్లలో అందుబాటులో ఉన్నాయో, అదే డినామినేషన్లలో డిజిటల్ రుపీని విడుదల ఆర్‌బీఐ చేయనుంది.
 
రీటైల్ డిజిటల్ రుపీని బ్యాంకుల ద్వారా ఆర్‌బీఐ జారీ చేస్తుంది. పార్టిసిపేటింగ్ బ్యాంకులకు చెందిన డిజిటల్ వ్యాలెట్‌లో డిజిటల్ కరెన్సీ ఉంటుంది. ఈ కరెన్సీ ఉపయోగించి లావాదేవీలు చేయొచ్చు. తమ స్మార్ట్‌ఫోన్లు, డివైజ్‌లల్లో స్టోర్ చేసుకోవచ్చు. పర్సన్ టు పర్సన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, పర్సన్ టు మర్చెంట్ అంటే వ్యాపారులకు, కస్టమర్లకు మధ్య డిజిటల్ కరెన్సీతో లావాదేవీలు చేయొచ్చు. వ్యాపారుల దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది.
 
ప్రజల దగ్గర ఉన్న కరెన్సీ నోట్లలాగానే ఇ -ఆర్ కూడా విశ్వసనీయమైనది. సురక్షితంగా ఉంటుంది. వీటిని ఏదైనా బ్యాంకుల్లో కన్వర్ట్ చేసి కరెన్సీ నోట్లు తీసుకోవచ్చు. లేదా డిపాజిట్ చేయొచ్చు. రియల్ టైమ్‌లో డిజిటల్ రూపాయి సృష్టించడం, పంపిణీ చేయడం, రిటైల్ కస్టమర్లు వినియోగించడం లాంటివన్నీ పైలట్ ప్రాజెక్ట్‌లో పరీక్షిస్తారు. అవసరమైన మార్పు చేర్పులు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తారు.
 
 పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎనిమిది బ్యాంకుల్నిఆర్‌బీఐ గుర్తించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి ఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులతో కలిసి దేశంలోని నాలుగు పట్టణాల్లో పైలట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు పైలట్ ప్రాజెక్ట్‌లో చేరతాయి.
 
మొదట ముంబై, న్యూ ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఆ తర్వాత అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గువాహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, షిమ్లా నగరాల్లో పైలట్ ప్రారంభం అవుతుంది. అవసరాన్ని బట్టి మరిన్ని బ్యాంకుల్ని చేర్చుకోవడం, కొత్త ప్రాంతాల్లో పైలట్ ప్రారంభించడంపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుంది.
 
ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లకు అదనంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అందుబాటులో ఉంటుంది. ఈ డిజిటల్ కరెన్సీ వినియోగదారులకు అదనపు చెల్లింపు మార్గంగా ఉంటుందని, ఇప్పటికే ఉన్న చెల్లింపు వ్యవస్థల్ని రీప్లేస్ చేయడం డిజిటల్ కరెన్సీ లక్ష్యం కాదని ఆర్‌బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. 
 
ఇప్పుడు డబ్బు కరెన్సీ నోట్ల రూపంలో ఉన్నట్టు, డిజిటల్ రూపంలో కూడా ఉంటుంది. కరెన్సీ నోటుకు ఎంత విలువ ఉంటుందో డిజిటల్ రుపీకి అంతే విలువ ఉంటుంది.  ఉదాహరణకు ఆర్‌బీఐకి రూ.1,000 కోట్ల కరెన్సీ ముద్రించాల్సిన అవసరం వచ్చిందనుకుందాం.
రూ.1,000 కోట్లు ఫిజికల్ కరెన్సీ నోట్లు ముద్రించకుండా డిజిటల్ కరెన్సీగా విడుదల చేస్తుంది.
బ్యాంకులకు ఫిజికల్ నోట్లు పంపించకుండా డిజిటల్ కరెన్సీని ఆన్‌లైన్‌లో పంపిస్తుంది. బ్యాంకులు, కస్టమర్లు డిజిటల్ కరెన్సీతో లావాదేవీలు చేయొచ్చు. డిజిటల్ కరెన్సీ కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అవుతుందో ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడం సులువు అవుతుంది. అయితే సాధారణ ప్రజలకు ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే ఎలా ఉపయోగించాలన్నదానిపై స్పష్టత వస్తుంది.