రాముడి ఉనికి నమ్మని వారిప్పుడు రావణుడిని తీసుకొచ్చారు

అసలు రాముని ఉనికి ఏనాడూ నమ్మని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం రామాయణం నుండి రావణుడిని తీసుకొచ్చారని, ఇలాంటి కఠిన పదాలు వాడిన వారు కనీసం పశ్చాతాపం కూడా పడడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవల తనను రావణుడితో పోలుస్తూ విమర్శలు చేయడాన్ని ప్రసత్తవిస్తూ  శ్రీరాముని భక్తులు ఉన్న గడ్డలో ఓ వ్యక్తిని రావణుడని అభివర్ణించడం సరికాదని హితవు చెప్పారు. 
“నేను ఖర్గేజీని గౌరవిస్తాను. ఆయన పార్టీ అధిష్ఠానం ఆదేశాలను అనుసరించి నాకు వంద తలలు (రావణుడి వలే) ఉన్నాయని నిందించారు. కానీ కాంగ్రెస్ ఓ విషయం మరచిపోతున్నది. గుజరాత్ లో ఉంది రామభక్తులు. శ్రీరాముడి ఉనికిని ఏనాడూ విశ్వసింపని వారు కేవలం నన్ను దూషించడం కోసం ఇప్పుడు రామాయణం నుంచి ‘ రావణుడిని’ రామరాజ్యంకు తీసుకు వచ్చారు” అంటూ ఎద్దేవా చేశారు. 
తనను అవమానించేందుకు కాంగ్రెస్‌లో పోటాపోటీ ఉందని పేర్కొంటూ  తీవ్రంగా, పదునైన మాటలతో అవమానించడంలో పోటీ ఉందని ఎద్దేవా చేశారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న మోదీ గురువారం కలోల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గుజరాత్ లో జరుగుతున్న ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కు ఓ గుణపాఠం చెప్పాలని ప్రధాని పిలుపిచ్చారు. 
కొద్ది రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ, మోదీ కుక్క చావు చస్తారని అన్నారని ప్రధాని గుర్తు చేశారు. నియంత హిట్లర్ మాదిరిగా మోదీ చచ్చిపోతారని మరొక కాంగ్రెస్ నేత అన్నారని తెలిపారు. నేనే మోదీని చంపేస్తానని మరొక నేత అన్నారని పేర్కొన్నారు. రావణుడని ఓ నేత, రాక్షసుడని మరొక నేత, బొద్దింక అని మరో నేత తనను అవమానిస్తున్నారని తెలిపారు.
తనను కాంగ్రెస్ నేతలు దూషించడం తనకేమీ ఆశ్చర్యంగా లేదని ప్రధాని చెప్పారు. మోదీని దూషించడం, దేశ ప్రధానిని అవమానపరచడం తమ హక్కుగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వారికి రాముడిపై, రామ మందిరంపై, రామసేతుపై నమ్మకం లేదని తనకు తెలుసని తెలిపారు.
కానీ అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ కాంగ్రెస్ పశ్చాత్తాపం చెందడం లేదని తనకు ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. ఈ విషయంలో ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుందని చెప్పారు. తనకు గుజరాత్ ఇచ్చిన బలం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. ‘మోదీకి ఆయన స్థాయి ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామ’ని మరో కాంగ్రెస్ నేత అన్నారని తెలిపారు.
అది సరిపోదని, ఇంకా ఏదో మాట్లాడవలసి ఉందని కాంగ్రెస్ భావించిందని, అందుకే ఖర్గేను పంపించిందని ఎద్దేవా చేశారు. ఆయన కోపంలో ఆ మాట అని ఉండవచ్చని చెప్పారు. ఒక  కుటుంబాన్ని సంతృప్తి పరచడం కాంగ్రెస్ లో ఫ్యాషన్ గా మారినదని చెబుతూ అందుకనే తనను దూషించడంలో ఆ పార్టీ నేతలు పోటీ పడుతున్నారని ధ్వజమెత్తారు.