పంజాబ్ సరిహద్దుల్లో మరో పాక్ డ్రోన్ కూల్చివేత

పంజాబ్ రాష్ట్రంలోని పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం ఉక్కుపాదం మోపింది. అమృత్‌సర్‌లోని భారత భూభాగంలోకి చొరబడడాన్ని గమనించిన బీఎస్‌ఎఫ్ సైనికులు పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేశారు. సరిహద్దు ఫెన్సింగ్‌ వైపున ఉన్న పొలంలో డ్రోన్‌ పడిపోయిందని, అందులో తెలుపు రంగు పాలిథిన్‌ కవర్‌లో అనుమానస్పద వస్తువుతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న ఒక హెక్సాకాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ పీఆర్‌వో తెలిపారు.

డ్రోన్ పంజాబ్ రాష్ట్రంలోని చహర్‌పూర్ గ్రామ సమీపంలోని భారత భూభాగంలోకి చొరబడడాన్ని గమనించిన తర్వాత భారత సైనికులు దానిపై కాల్పులు జరిపారు.దీంతో పాక్ మరో స్మగ్లింగ్ ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు సైనిక అధికారులు తెలిపారు. బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో పాక్ డ్రోన్ నేలకూలింది. చహర్‌పూర్ గ్రామ సమీపంలో సరిహద్దు ఫెన్సింగ్‌ వద్ద ఉన్న వ్యవసాయ పొలంలో పడి ఉన్న తెల్లటి రంగు పాలిథిన్‌లో అనుమానిత వస్తువును బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని సరిహద్దు సమీపంలో ఇద్దరు చొరబాటుదారులను గుర్తించిన తర్వాత బీఎస్ఎఫ్ వారి చొరబాటు యత్నాన్ని విఫలం చేసింది. సరిహద్దుల్లో అమర్చిన థర్మల్ కెమెరాలో పాకిస్థాన్ చొరబాటుదారుల కదలికలు రికార్డయ్యాయి.

ఈ నెల 25న సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్‌లు జారవిడిచిన ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఈడీతో పాటు చైనాలో తయారైన రెండు పిస్టల్స్‌తో పాటు భారీ మొత్తంలో బుల్లెట్లు, ఐదు లక్షల భారతీయ కరెన్సీని ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు సరిహద్దు ఆవల నుంచి ఆయుధాలు, డబ్బును పంపినట్లు అనుమానిస్తున్నారు.

2021తో పోలిస్తే భారత భూభాగంలోకి పాకిస్థానీ డ్రోన్‌ల చొరబాటు పెరిగింది. సరిహద్దు వెంబడి ఈ ఏడాది దాదాపు 230 డ్రోన్‌లు కనిపించాయి.ఈ డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆయుధాలు, డ్రగ్స్ పంపుతుందని బీఎస్ఎఫ్ జవాన్లు చెప్పారు.