ఆయతుల్లా ఖొమైనీ మేనకోడలు అరెస్ట్‌

ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా గత కొన్నాళ్లుగా సాగుతున్న ఆందోళనలను కర్కశంగా అణచివేసేందుకు ప్రభుత్వం వెనకాడటం లేదు. అయినా అణచివేతను ధిక్కరిస్తూ  ఆందోళనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నిరసన ఎవరకు ప్రదర్శించినా ఊరుకునేది లేదనేది చెప్పడానికి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మేన కోడలును కూడా అరెస్ట్‌ చేశారు. అలాగే, భారత్‌కు వెళ్లేందుకు ఓ సినీ నిర్మాతకు ఇరాన్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళన సాగుతున్న వారినందరినీ జైళ్లకు పంపుతున్న ఇరాన్‌ ప్రభుత్వం తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ మేనకోడలు ఫరీదే మొరద్‌ఖానీని కూడా అరెస్ట్‌ చేశారు. ఇరాన్‌ ప్రభుత్వం అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ సుప్రసిద్ధ మానవ హక్కుల కార్యకర్త ఫరీదో మొరద్‌ఖానీ  ఇరాన్‌తో సంబంధాలను తుంచుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

ఈమె వీడియో వైరల్‌ కాగానే ఆయనను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఇరాన్‌ ప్రభుత్వాన్ని ఆమె ‘హంతకులు’, ‘పిల్లల్ని చంపేవారు’గా అభివర్ణించారు. కాగా, ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతుల్లా ఖొమైనీని జర్మన్ నియంతలు హిట్లర్, ముస్సోలినీతో పోల్చేవారు.

ఇలా ఉండగా, ఇరాన్‌ సినిమా నిర్మాత రెజా డోర్మ్‌షియాన్‌ను భారత్ వెళ్లేందుకు ఇరాన్‌ ప్రభుత్వం అనుమతించలేదు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనేందుకు రెజా గోవాకు రావాల్సి ఉన్నది. ఆయన నిర్మించిన ‘ఎ మైనర్’ సినిమా అక్కడ ప్రదర్శనకు ఎంపికైంది. అయితే హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నవారికి రెజా మద్దతు తెలుపడంతో ఆయనపై ప్రభుత్వం కక్షగట్టింది.

 బ్యాంక్‌ మేనేజర్‌కు ఉద్వాసన
 
మరోవంక, హిజాబ్‌ ధరించని ఓ మహిళకు సేవలు అందించిన బ్యాంక్‌ మేనేజర్‌ను ఇరాన్‌ ప్రభుత్వం తొలగించింది. రాజధాని టెహ్రాన్‌కు సమీపంలోని కోమ్‌ ప్రావిన్స్‌కి చెందిన బ్యాంక్‌ మేనేజర్‌ గురువారం ఓ మహిళకు సేవలు అందించారని  ఆగ్రహించిన ప్రభుత్వం అతనిని ఉద్యోగం నుండి తొలగించింది. గవర్నర్‌ ఆదేశాల మేరకు అతనిని తొలగించినట్లు డిప్యూటీ గవర్నర్‌ అహ్మద్‌ హజిజాదే మీడియాకి తెలిపారు.
 
ఇరాన్‌లో చాలా బ్యాంకులు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని, హిజాబ్‌ చట్టాన్ని అమలు చేయడం ఆ సంస్థల్లోని మేనేజర్‌ల బాధ్యత అని హజిజాదే చెప్పారు. ఇరాన్‌లో హిజాబ్‌ను తప్పనిసరిచేసింది. అక్కడి ప్రభుత్వం. మహిళల వస్త్రధారణపై కూడా పలు ఆంక్షలు విధించింది. బిగుతుగా ఉండే జీన్స్‌ను నిషేధించడంతో పాటు తలను, జుట్టును కవర్‌ చేసేలా హిజాబ్‌, హెడ్‌స్కార్ఫ్‌ను ధరించాలని ఆదేశించింది.
 
జులైలో హిజాబ్‌ను తప్పరిసరి చేస్తూ ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రాష్ట్రాలు ఈ ఆదేశాలను పాటించేలా ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 16న హిజాబ్‌ ధరించలేదంటూ మాహ్సా అమ్ని అనే మహిళను నైతిక పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.అనంతరం కస్టడీలో ఆమె మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
 
జుట్టును కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను తగుల బెడుతూ మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా బలగాలు కాల్పులకు దిగుతున్నాయి. అయితే, పాశ్చాత్య దేశాలు   ఇరాన్‌ లో అల్లర్లను ప్రోత్సహిస్తున్నాయంటూ అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. 1979 ఇస్లామిక్‌ విప్లవం తరువాత, నాలుగు దశాబ్ధాల అనంతరం మరోసారి ఇరాన్‌ వ్యాప్తంగా భారీ హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయ.