గుజరాత్ లో బిజెపికి మూడింట రెండొంతుల మెజారిటీ!

గుజరాత్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఏబీపీ-సీఓటర్ సర్వే ప్రకారం బిజెపి మూడింట రెండొంతుల మెజారిటీతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండగా, స్పష్టమైన మెజారిటీ ఆ పార్టీకి లభిస్తుందని ఇండియా టివి-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేస్తున్నది.

తాజా ఏబీపీ-సీవోటర్ సర్వే ప్రకారం 182 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 134-142 సీట్లు కైవసం చేసుకొనే అవకాశం ఉంది. అయితే, 117 సీట్లు గెల్చుకోవచ్చని ఇండియా టివి-మ్యాట్రిజ్ పోల్ వెల్లడించింది.  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో రెండు దశల్లో జరగనుండగా.. డిసెంబర్ 8న హిమాచల్ ఎన్నికలతో పాటు ఫలితాలు వెల్లడికానున్నాయి.
 
ప్రధాని నరేంద్ర మోదీ  సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఆరుసార్లు విజయం సాధించింది. అయితే ఈసారి దూకుడుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కొత్త రూపం కాంగ్రెస్‌.. బీజేపీ విజయాన్ని అడ్డుకోవడంలో విఫల ప్రయత్నం చేసినట్లేనని ఈ సర్వేలు చెబుతున్నాయి.
 
2017 ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకున్నాయి. తాజా సర్వే ప్రకారం ఈసారి కాంగ్రెస్ 28-36 సీట్లు గెలుచుకోగా, రాష్ట్రంలో ఆప్ తన ఖాతా తెరిచి 7-15 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఏబీపీ-సీవోటర్ సర్వే చెబుతుంది.  ఓట్ల శాతం పరంగా చూస్తే, పోల్ అయిన ఓట్లలో 45.9 శాతం ఓట్లు బీజేపీకి వస్తాయని అంచనా వేసింది.
 
ఇది 2017 గుజరాత్ ఎన్నికలలో వచ్చిన దానికంటే 3.2 శాతం తక్కువ. రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం 26.9 శాతం ఓట్లను మాత్రమే సాధిస్తుందని అంచనా. ఇది గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే -14.5 శాతం గణనీయంగా పడిపోయింది. ఇసుదాన్ గద్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మొత్తం పోలైన ఓట్లలో 21.2 శాతం ఓట్లను పొందగలదని ఏబీపీ-సీఓటర్ సర్వేలో తేలింది. ఆప్ గణనీయంగా ఓటు శాతాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది.
 
ప్రాంతాల వారీగా సర్వే ప్రకారం సెంట్రల్ గుజరాత్‌లో బీజేపీ 45-49 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్‌కు 10-14 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మధ్య గుజరాత్‌లో 61 నియోజకవర్గాలు ఉన్నాయి. 32 నియోజకవర్గాలున్న ఉత్తర గుజరాత్‌లో బీజేపీ 20-24 సీట్లు, కాంగ్రెస్‌కు 8-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
 
భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కాషాయ పార్టీ దక్షిణ గుజరాత్‌లో ఆధిపత్యం చెలాయిస్తుంది. మొత్తం 35 నియోజకవర్గాల్లో 27-31 స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాంగ్రెస్‌కు కేవలం 2-6 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది. 54 సీట్లున్న కచ్-సౌరాష్ట్ర ప్రాంతంలో బీజేపీ 38-42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 4-8 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా. ఈ ప్రాంతంలో ఆప్‌కి 7-9 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది.
 
ఇక, ఇండియా టివి-మ్యాట్రిజ్ పోల్ ప్రకారం బిజెపి 117, కాంగ్రెస్ 59, ఆప్  ,  4 ఇతరులు 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ.. సెంట్రల్ గుజరాత్ ప్రాంతంలో 54% ఓట్లతో 43 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 17 సీట్లు వస్తాయని అంచనా. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడంలో విఫలమవుతుందని, ఇతరులు ఒక సీటు పొందవచ్చని ఇండియా టీవీ-మ్యాట్రిజ్  పోల్ తెలిపింది.
 
ఉత్తర గుజరాత్ ప్రాంతంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేసింది. ఈ ప్రాంతంలోని 32 సీట్లలో… బీజేపీకి 15 సీట్లు, కాంగ్రెస్‌కు 17 సీట్లు వచ్చే అవకాశం ఉందని. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ప్రాంతంలో ఏ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తెలిపింది. దక్షిణ గుజరాత్ విషయానికి వస్తే.. బీజేపీకి 26 సీట్లు, కాంగ్రెస్‌కు 6, ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 2 సీట్లు రావచ్చు. ఈ ప్రాంతంలో బీజేపీకి 50%, కాంగ్రెస్‌కి 36%, ఆప్‌కి 12%, ఇతరులకు 2% ఓట్లు వస్తాయని అంచనా.
 
సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలోని మొత్తం 54 సీట్లలో… 33 స్థానాలు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద ప్లేయర్‌గా అవతరించే అవకాశం ఉందని, కాంగ్రెస్ 19, ఆప్ 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని.. ఓట్ల శాతం విషయానికొస్తే, బీజేపీకి 48%, కాంగ్రెస్‌కు 40%, ఆప్‌కి 11% ఓట్లు వస్తాయని అంచనా వేసింది.  సౌరాష్ట్ర ప్రాంతంలో, వెనుకబడిన ఓటర్లు బిజెపికి 53% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నందున బిజెపితో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు 39%, ఆప్‌కి 5% ఓట్లు వచ్చాయి.