‘కశ్మీరీ ఫైల్స్‌’ పై ఇజ్రాయిల్‌ నిర్మాత వాఖ్యలపై రాయబారి క్షమాపణ

వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించి నిర్మించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపైఅంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ-ఇఫి)లో ఇజ్రాయిల్‌ నిర్మాత, జ్యూరీచీఫ్‌ నడవ్‌ లాపిడ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా ప్రచారం కోసం తీశారని, అసభ్యకరమైన చిత్రమని వ్యాఖ్యానించడం పట్ల పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

‘‘53వ ఫిలిం ఫెస్టివల్ లో ఉండాల్సిన సినిమా కాదు. ఆర్టిస్టిక్ కేటగిరిలో ఇలాంటి సినిమా చూసి షాక్ అయ్యాం. ఈ మాటని బహిరంగంగా చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. ఇది ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా’’ అంటూ మండిపడ్డారు.నదవ్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీనిపై స్పందించిన జ్యూరీ బోర్డు..అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది.

ఈ వ్యాఖ్యల పట్ల భారత్‌లోని ఇజ్రాయిల్‌ రాయబారి నాయర్‌ గిలాన్‌ భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పారు. ప్యానెల్‌కు అధ్యక్షత వహించాల్సిందిగా భారతీయ ఆహ్వానాన్ని లాపిడ్‌ దుర్వినియోగ పరిచారని, అందుకు సిగ్గుపడాలని ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులకు రాసిన బహిరంగ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు: “భారతీయ సోదర, సోదరీమణులు అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ లేఖను హిబ్రూలో రాయలేదని, ముందుగా లేఖలో చివరి లైన్‌ను ప్రస్తావిస్తున్నాను” అని తెలిపారు.

”మీరు సిగ్గుపడాలి ఎందుకంటే… భారతీయ సంప్రదాయంలో అతిథిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి దేశానికి వచ్చి ఇఫిలలో జడ్జీ ప్యానెల్‌కు హెడ్‌గా ఉన్న మీరు ఆతిథ్యమిచ్చిన దేశాన్నే అవమానించారు. చారిత్రక ఘటనల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాటి గురించి వ్యాఖ్యానించడం సరికాదు. మీ వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్‌ దేశస్థుడిగా నేను సిగ్గుపడుతున్నా. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేస్తున్నా” అని గిలాన్‌ తమ దేశపు నిర్మాత వాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారత దేశ ప్రేమను పంచుకోవడానికి తనను ఆహ్వానించారని గుర్తించాలని హితవు చెప్పారు. భారత్‌కు, ఇజ్రాయిల్‌కు సారూప్యత ఉందని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌ కౌన్సిల్‌ జనరల్‌
కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై తమ దేశానికి చెందిన చిత్ర నిర్మాత నాదవ్‌ లాపిడ్‌ చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్‌ కోబ్బి శోషని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూరీ హెడ్‌ నాదవ్‌ స్టేట్‌మెంట్‌ పూర్తిగా తప్పు అని చెప్తూ.. ‘సినిమా చూడగానే నా కళ్లలో నీళ్లు రావడం మొదలయ్యాయి. ఈ సినిమాను చూడటం అంత తేలికైంది కాదు. ఈ సినిమాను ఇజ్రాయెల్‌లో కూడా ప్రదర్శించారు. భయంకరమైన విషయాలను అనుభవించిన యూదులు, ఇతరుల బాధలను అర్థం చేసుకోవాలని నేను భావిస్తున్నాను..’ అని వెల్లడించారు.

ఇఫీ జ్యూరీ హెడ్‌గా వ్యవహరించిన ఇజ్రాయెల్‌ చిత్రనిర్మాత నాదవ్‌ లాపిడ్‌ ప్రకటనను ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తీవ్రంగా ఖండించారు. ‘అబద్దం ఎంత ఎత్తులో ఉన్నా.. నిజంతో పోలిస్తే అది చిన్నదే..’ అని సోషల్‌ మీడియాలో తన ప్రకటనను షేర్‌ చేశారు. ఇదే సమయంలో మరో వార్త సంస్థతో మాట్లాడిన ఆయన.. యూదుల మారణహోమం నిజమే అయితే.. కశ్మీరీ పండ్లి వలసలు కూడా నిజమే అని చెప్పారు.

టూల్‌కిట్‌ గ్యాంగ్‌ యాక్టీవ్‌గా మారిన వెంటనే ఈ వాదనలు తెరపైకి వచ్చాయని, ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తున్నదని ధ్వజమెత్తారు.  ఇఫీ జ్యూరీ హెడ్‌గా ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. వేలు, లక్షల మంది ప్రజల విషాదాన్ని తన ఎంజెండాను నెరవేర్చుకోవడం కోసం ఉపయోగించకుండా దేవుడు ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని చెప్పారు.

ఆ ప్రకటన ఆయన వ్యక్తిగతం
ఇలాఉండగా, జ్యూరీ హెడ్‌ నాదవ్‌ లాపిడ్‌ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని 53 వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ) జ్యూరీ బోర్డు నిర్ణయించింది. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని బోర్డు తరఫున మరో ప్రకటన వెలువరిస్తూ జ్యూరీ సుదీప్తో సేన్‌ ట్వీట్‌ చేశారు. జ్యూరీ బోర్డు ఎప్పుడూ తన ఇష్టాలు, అయిష్టాల గురించి అధికారికంగా వెల్లడించదని పేర్కొన్నారు.