బీజేపీ భరోసా యాత్ర ప్రారంభించిన డీకే అరుణ

తెలంగాణలో అధికారమే లక్షంగా బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు గద్వాల నియోజకవర్గంలో ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్రను ఆదివారం కేటిదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకే ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్రను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి నోచుకోలేదని ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ఆమె మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటైనా నెరవేర్చిందా  అని ఆమె ప్రశ్నించారు.

రైతుబంధు పేరిట ఎకరాకు రూ.5వేలు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతమంది ధనికులు రైతుబంధు తీసుకుంటాన్నారో చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె నిలదీసేరు. రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం విడ్డూరమని ఆమె విమర్శించారు.