సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం తన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. మంత్రి తన మద్దతుదారులతో కలిసి అడ్డగుట్ట డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కిషన్‌రెడ్డి అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
 
 కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రాలను అందించారు. అడ్డగుట్ట, తుకారాం గేట్, తార్నాక, లాలాపేట్, మెట్టుగూడ ప్రాంతాలను ఆయన పాదయాత్ర కొనసాగింది. బస్తీవాసులను అడిగి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.  స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మంత్రి కిషన్ రెడ్డి ముందుకు సాగారు.
డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. అడ్డగుట్టలో పాదయాత్రకు వెళ్లిన ఆయనకు.. అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు. సోమవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహించనున్నారు.
తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇవాళ పూర్తిగా సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలోనే ఆయన పర్యటించనున్నారు. సాయంత్రం బోరబండ, ఎర్రగడ్డలలో పర్యటించారు.