కేంద్ర ఆర్ధిక మంత్రి సమావేశంకు హరీష్ రావు గైరాజర్ పై బిజెపి ధ్వజం

ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎందుకు వెళ్ళలేదు? అని బీజేపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల విషయంలో అనునిత్యం అబద్ధాలతో కేంద్రాన్ని బదనాం చేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వారు చెప్పేవి నిజాలైతే అవే అంశాలు మీటింగు కు వెళ్లి ప్రస్తావించవచ్చు కదా? అని ఆమె నిలదీశారు.
 
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులు, కార్పొరేషన్లు ఇస్తున్నటువంటి అప్పుల విషయంలో కూడా చర్చలో పాల్గొనకుండా ముఖం చాటేయడంతో వారి అసలు స్వరూపం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆమె ధ్వజమెత్తారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెళ్లకుండా తూతూ మంత్రంగా లేఖ రాయడం భాధ్యతా రాహిత్యమే అంటూ విమర్శించారు.
 
హరీష్ రావు రాసిన లేఖలో దేశ ద్రవ్యోల్భణం గురించి మాట్లాడారు కానీ దేశంలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణ రేటు తెలంగాణలో 8.82% శాతం ఉందగా,  దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆమె దుయ్యబట్టారు.  తెలంగాణ రాష్ట్రం దివాలా తీయడానికి కేంద్రం కారణమైతే అన్ని రాష్ట్రాల పరిస్థితి అలాగే ఉండాలి కదా? కానీ తెలంగాణ రాష్ట్రం దేశం లోనే ధరల పెరుగుదల లో ఎందుకు నెంబర్ 1 గా ఉందని
రాణి రుద్రమ ప్రశ్నించారు.
 
పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఇక్కడే ఎందుకు ఎక్కువ ఉన్నాయి?అంటూ  ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఆర్థికంగా మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించింది వారి క్రమశిక్షణ రాహిత్యం కాదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు.
 
హరీష్ రావు తన లేఖలో ప్రస్తావించిన ఐటిఐఆర్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో భూసేకరణ చేయకుండా, సమయానికి స్పందించకుండా, సమావేశాలకు హాజరు కాకుండా ఆ ప్రాజెక్టుల జాప్యానికి కారణం అవుతున్నది మీరు కాదా? అంటూ ఆమె నిలదీశారు.
అన్ని తప్పులు వారి వైపే ఉన్నాయి కాబట్టి సమావేశాలకు హాజరైతే వారు చెప్పే అబద్ధాలు బయటపడతాయి కాబట్టి హాజరు కావడానికి హరీష్ రావుకు  ముఖం చెల్లడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ అసమర్థతే రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కారణమని ఒప్పుకొని, కేంద్రంతో అన్ని విషయాలు నిజాయితీగా చర్చించి, కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని రాణి రుద్రమ హితవు చెప్పారు.