దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలం

దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటూ సుప్రీం కోర్టు ఇ-ఇనిషియేటివ్‌ (వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌, జస్టిస్‌ మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్టు, ఎస్‌3వాస్‌ వెబ్‌సైట్‌లు)లను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని క్రమం తప్పకుండా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ సభలోని మహిళల త్యాగాల గురించి చర్చ చాలా అరుదుగా ఉంటుందని, కనుక వారి గురించి యువతకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రాజ్యాంగ అసెంబ్లీలో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో వెనుకబడిన సమాజానికి చెందిన దాక్షాయణి వేలాయుధన్‌ కూడా ఉన్నారని ప్రధాని చెప్పారు.

ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరులకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొంటూ ‘‘వ్యక్తులు గానీ, సంస్థలు గానీ.. మన ప్రాథమిక విధులే మనకు మొదటి ప్రాధాన్యత. ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థంగా నిర్వహించడం ద్వారా దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

ప్ర‌స్తుత ప్రపంచ ప‌రిస్థితిలో, యావత్ ప్ర‌పంచం భార‌త‌దేశాన్ని ఎదుగుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ , అంత‌ర్జాతీయ ప్ర‌తిష్ట‌ల మ‌ధ్య ఆశ‌తో చూస్తోంద‌ని చెబుతూ ఈ విజయానికి మన రాజ్యాంగం కారణమని పేర్కొన్నారు. “ఆధునిక కాలంలో, రాజ్యాంగం దేశపు అన్ని సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలను స్వీకరించింది” అని తెలిపారు.

రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులు అనేవి పౌరులు అత్యంత అంకితభావంతో నిర్వర్తించాల్సిన బాధ్యతలు అని మహాత్మా గాంధీ అన్న మాటలను మోదీ గుర్తు చేశారు. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు వచ్చే 25 ఏండ్లు అమృత కాలమని, దీనిని ‘కర్తవ్య కాలం’గా భావిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ విధులను బాగా నిర్వర్తించాలని ఆయన కోరారు. మన రాజ్యాంగ పీఠికలోని మొదటి మూడు పదాలు.. ‘వియ్ ద పీపుల్ (మేం, ప్రజలం)’ అనేవి కేవలం పదాలు కావని, అవి ఒక పిలుపు, సత్యం, ప్రతిజ్ఞ అని మోదీ తెలిపారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్‌కాల్‌లో, రాబోయే 25 ఏళ్ల అభివృద్ధి కోసం మనం ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో కర్తవ్యం అనే మంత్రాన్ని ప్రధాని నొక్కిచెప్పారు.  “ఆజాదీ కా అమృత్ కాల్ దేశం పట్ల కర్తవ్యం చెప్పాల్సిన సమయం. ప్రజలు లేదా సంస్థలు కావచ్చు, మన బాధ్యతలే మన మొదటి ప్రాధాన్యత” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

‘కర్తవ్య మార్గాన్ని’ అనుసరించడం ద్వారా దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకోగలదని ఆయన స్పష్టం చేశారు.  “ఆజాదీ కా అమృత్ కాల్‌లో, ఇది దేశానికి అవసరం. ఈ రాజ్యాంగ దినోత్సవం ఈ దిశలో మన తీర్మానాలకు మరింత శక్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ ప్రధాన మంత్రి ముగించారు.

న్యాయ వ్యవస్థకు ప్రజలు చేరువ కావడానికి బదులు, ప్రజలకే న్యాయ వ్యవస్థే చేరువ కావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగం చారిత్రాత్మకంగా అధికారంలో ఉన్న వారికి, అట్టడుగున ఉన్న వారికి మధ్య ఒక సామాజిక ఒప్పందమని పేర్కొన్నారు. దేశంలోని జిల్లా కోర్టుల నుండి అత్యున్నత న్యాయస్థానం వరకు పౌరుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని పొందడంపై ప్రతిబింబించడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.

సామాన్యులు అర్థం చేసుకునేందుకు కోర్టుల్లో స్థానిక భాషలను అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. న్యాయ విద్యను స్థానిక భాషలోనే నిర్వహించాలని చెప్పారు. ప్రతి పంచాయితీకి తప్పనిసరిగా న్యాయ సలహా విభాగం ఉండాలని సూచించారు. అట్టడుగు స్థాయిలో న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్లు స్పష్టం చేశారు.