సోనియా, రాహుల్ ల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న అశోక్‌ గహ్లోత్

కాంగ్రెస్ అధ్యక్షునిగా మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నికైన తర్వాత వాస్తవానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పార్టీ ఎంపిలు, సిడబ్ల్యుసి సభ్యులు మాత్రమే. వారికి ఎటువంటి పార్టీ పరంగా ఎటువంటి కార్యనిర్వాహక పదవులు లేనే లేవు. అయితే ఒక వంక భారత్ జోడో యాత్ర పేరుతో 2024 ఎన్నికల కోసం రాహుల్ పర్యటనలు జరుపుతూ ఉండగా, పార్టీలో కీలక అధికార కేంద్రంగా ఇంకా ఆ కుటుంబమే కొనసాగుతున్నది.
 
తనకు సన్నిహితుడైన సచిన్ పైలట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమించాలని నాలుగేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటి నుండి రాహుల్ చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి అశోక్‌గహ్లోత్‌ పడనీవడం లేదు. పార్టీ ఎమ్యెల్యేలల్లో అత్యధికుల మద్దతు కూడదీసుకుని గెహ్లాట్ ఒక విధంగా ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నారు.
 
కేవలం `ఉత్సవ విగ్రహం’గా భావిస్తున్న పార్టీ అధ్యక్షునిగా గెహ్లాట్ ను చేయడం ద్వారా, ముఖ్యమంత్రి పదవిని పైలట్ కు కట్టబెట్టాలని రాహుల్ చేసిన ప్రయత్నం వికటించింది. పార్టీ ఎమ్యెల్యేలు బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. పైలట్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కోసం పార్టీ పరిశీలకుడిగా జైపూర్ వెళ్లి, పరాజయంతో తిరిగి వచ్చిన ఖర్గే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అయినా పైలట్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే ప్రయత్నాలను గెహ్లాట్ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
 
పైలట్ ను ముఖ్యమంత్రిగా చేస్తే పార్టీ ఎమ్యెల్యేలు సహకరించే ప్రసక్తి లేదనే స్పష్టమైన సంకేతం గెహ్లాట్ ఇచ్చారు. తన స్థానంలో 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తనకిష్టమేనని, పైలట్‌కు మాత్రం అవకాశం ఇవ్వడానికి వీల్లేదని గురువారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
 
 బీజేపీ దన్నుతో రెండేళ్ల కింద రాష్ట్రంలో సొంత పార్టీ ప్రభుత్వాన్నే కూల్చాలని కూల్చాలని ప్రయత్నించి పార్టీకి పైలట్‌ ద్రోహం చేశారని అంటూ దుయ్యబట్టారు. ఈ అంశంపై రెండు నెలలుగా రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభంలో ప్రేక్షక పాత్ర వహించడం మినహా అధిష్ఠానం ఏమీ చేయలేక పోతున్నది.
 
మరోవంక, పైలట్ సహితం ముఖ్యమంత్రిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ఘోరంగా ఓడిందని గహ్లోత్‌ సారథ్యంలో రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించనున్న తరుణంలో వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం కలవరపాటుకు గురైంది. మరో ఏడాదికి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రంలో ఈ విధంగా పార్టీ పరిస్థితి తమ అదుపు తప్పడం గాంధీ కుటుంబానికి మింగుడు పడటం లేదు. 
 
ఇలాంటి పరుష వ్యాఖ్యలు సీనియర్‌ నేత అయిన ఓ ముఖ్యమంత్రి నోటి నుంచి రావడం అవాంఛనీయమని అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ `గాంధీ కుటుంభం’ నిస్సహాయ పరిస్థితి పట్ల సున్నితంగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘గహ్లోత్‌ వ్యాఖ్యలకు అందరూ ఆశ్చర్యపోయారు. మనమంతా ఓ కుటుంబం. కాంగ్రె్‌సకు అనుభవజ్ఞుడైన గహ్లోత్‌ లాంటి సీనియర్‌ నాయకుడూ కావాలి. పైలట్‌ వంటి ఔత్సాహిక యువ నేతా అవసరం. అయితే పార్టీయే సుప్రీం.. వ్యక్తులు కాదు. ఏ పరిష్కారమైనా దీని ఆధారంగానే జరుగుతుంది.’ అని తెలిపారు.