
మన్ కీ బాత్ కార్యక్రమంలో సిరిసిల్ల చేనేత కార్మికుడు యెల్ది హరిప్రసాద్ పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. జీ-20 సమావేశాల్లో హరిప్రసాద్ తన చేతితో స్వయంగా నేసిన లోగోను ఆయన చూపించారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి తాను ఆశ్చర్యపోయానని, చేనేత కార్మికుల గొప్పతనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని అభినందించారు.
హరిప్రసాద్ పంపిన ఈ బహుమతి అందుకోగానే తన మనసులో మరో ఆలోచన వచ్చిందని తెలిపారు. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి తాను చాలా సంతోషించానని మోదీ చెప్పారు. ఇంత పెద్ద సదస్సును మన దేశం నిర్వహించడం వల్ల హృదయం ఉప్పొంగిపోయిందని హరిప్రసాద్ లాంటి చాలా మంది తనకు లేఖలు పంపారని మోదీ పేర్కొన్నారు.
అదే విధంగా పూణే నుంచి సుబ్బారావు చిల్లారా, కోల్కతా నుంచి తుషార్ జగ్మోహన్ పంపిన సందేశాలను కూడా ప్రస్తావించారు. జీ20 ప్రెసిడెన్సీ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా గ్లోబల్ గుడ్, ప్రపంచ సంక్షేమంపై దృష్టి పెట్టాలని మోదీ పేర్కొన్నారు. శాంతి లేదా ఐక్యత, పర్యావరణం పట్ల సున్నితత్వం, స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన సవాళ్లకు భారతదేశం పరిష్కారాలను కలిగి ఉందని ప్రధాని తెలిపారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడం గర్వకారణంగా ఉందని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీలో భారత్ దూసుకెళ్తోందని మోడీ వివరించారు.
జి -20 ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు, ప్రపంచ వాణిజ్యంలో మూడు వంతులు, అలాగే ప్రపంచ జిడిపిలో 85 శాతం వాటాను కలిగి ఉందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. ఇవ్వాళ్టికి మరో 3 రోజుల తర్వాత, అంటే డిసెంబర్ 1 నుండి భారతదేశం ఇంత పెద్ద సమూహానికి, ఇంత శక్తివంతమైన సమూహానికి అధ్యక్షత వహించబోతోందని పేర్కొన్నారు.
ఇది నిజంగా భారతదేశానికి, ప్రతి ఒక్క భారతీయుడికీ వచ్చిన అపురూపమైన అవకాశం అని ప్రధాని స్పష్టం చేశారు. మనం అమృతోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో మనకీ గొప్ప అవకాశం దొరకడం మరో గొప్ప విశేషం అని తెలిపారు. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,
ప్రపంచానికి, మనకూ మేలు కలిగేలా మనం సర్వశక్తులూ ఒడ్డాలని ప్రధాని చెప్పారు. మనం ఇచ్చిన ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే థీమ్ వల్ల వసుధైవ కుటుంబమ్ అన్న సిద్ధాంతం పట్ల మనకున్న నిబద్ధత స్పష్టమవుతోందిని తెలిపారు.
ప్రైవేటు రంగంలో రాకెట్
కాగా, నవంబర్ 18న మొత్తం దేశమంతా ప్రైవేట్ రంగంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడాన్ని చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఆ రోజున భారతదేశం అంతరిక్షంలోకి పంపిన రాకెట్ ను పూర్తిగా ప్రైవేట్ రంగం డిజైన్ చేసి తయారు చేసిందని కొనియాడారు. ఆ రాకెట్ పేరు విక్రమ్-ఎస్. శ్రీహరికోట నుండి స్పేస్ స్టార్టప్ తయారుచేసిన ఈ మొట్టమొదటి రాకెట్ గగనతలంలోకి ఎగరగానే ప్రతిఒక్క భారతీయుడూ గర్వంగా తలెత్తుకుని నిలబడ్డాడని ప్రధాని తెలిపారు. విక్రమ్-ఎస్ రాకెట్ లో అనేక విధాలైన ప్రత్యేకతలున్నాయి.
మిగతా రాకెట్లతో పోలిస్తే అది చాలా తేలికైంది కూడా. పైగా చవకైంది కూడా. దాన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు మిగతా దేశాల్లోని ఇలాంటి ప్రాజెక్టులతో పోలిస్తే చాలా తక్కువ. చాలా తక్కువ తయారీ ఖర్చుతో ప్రపంచస్థాయి అంతరిక్ష విజ్ఞాన రంగంలో ఇప్పుడు భారతదేశం తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుందని ప్రధాని సంతోషం ప్రకటించారు.
ఈ రాకెట్ ని తయారు చేయడానికి మరో ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఉపయోగించారని అంటూ ఈ రాకెట్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన భాగాలను త్రీడీ ప్రింటింగ్ విధానంలో తయారు చేశారని ప్రధాని చెప్పారు. ఇది భారత దేశంలో ప్రైవేట్ రంగంలో ఓ సరికొత్త యుగానికి ఆరంభం అని పేర్కొన్నారు.
ఏ పిల్లలైతే కాయితంతో రాకెట్ ని చేసి గాల్లోకి వదిలేవారో వాళ్లకే ఇప్పుడు మన దేశంలోనే విమానాల్ని తయారు చేసే పూర్తి సామర్ధ్యం వచ్చిందని, ఏ పిల్లలైతే ఆకాశంలో ఉన్న చంద్రుడిని, చుక్కల్ని చూసి వివిధ రకాలైన బొమ్మలు వేసేవాళ్లో వాళ్లకిప్పుడు భారత దేశంలోనే రాకెట్ ని తయారు చెయ్యడాని అవకాశం లభిస్తోందని ప్రధాని వివరించారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే