ఇమాంలకు పారితోషికంపై `సుప్రీం’ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం

మసీదుల్లోని ఇమాంలకు పారితోషికం చెల్లించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు 1993లో జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాకుండా తప్పుడు దృష్టాంతాన్ని ఏర్పరచడంతోపాటు అనవసరమైన రాజకీయ బురదజల్లుడు కార్యక్రమానికి, సాంఘిక అశాంతికి కారణమవుతోందని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది.
ఆలిండియా ఇమాం ఆర్గనైజేషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 1993లో తీర్పు చెప్తూ, వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్న మసీదుల్లోని ఇమాంలకు పారితోషికాన్ని చెల్లించాలని ఆ బోర్డును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఇమాంలకు చెల్లిస్తున్న జీతాల వివరాలను తెలియజేయాలని కోరుతూ సమాచార హక్కు చట్టం ప్రకారం ఓ దరఖాస్తు దాఖలైంది.
దీనిపై కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మహుర్కర్ విచారణ జరిపి, వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్న మసీదుల్లోని ఇమాంలకు పారితోషికాన్ని చెల్లించాలని ఆ బోర్డును ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఏదైనా మతానికి అనుకూలంగా వినియోగించరాదని రాజ్యాంగ నిబంధనలు చెప్తున్నాయని, ఈ నిబంధనలను సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘించిందని చెప్పారు.
తన ఆర్డర్ నకలును కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపించాలని ఆదేశించారు. భారత రాజ్యాంగంలోని అధికరణలు 25 నుంచి 28 వరకు స్ఫూర్తిదాయకంగా, వాటిలోని భావానికి అనుగుణంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడం కోసం తన ఆర్డర్‌ను కేంద్ర మంత్రికి పంపించాలని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఖజానాను పణంగా పెట్టి, వివిధ మతాలకు చెందిన ప్రీస్ట్‌లకు నెలవారీ పారితోషికం విషయంలో అన్ని మతాలను సమానంగా చూడటంతోపాటు, ఇతర విషయాల్లో తగిన చర్యలు తీసుకోవడం కోసం దీనిని పంపించాలని తెలిపారు.
ఆలిండియా ఇమామ్ ఆర్గనేజేషన్, మరియు….. వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు 1993 మే 13న తీర్పు చెప్పింది. కేవలం మసీదుల్లోని ఇమాంలు, మౌజీన్లకు మాత్రమే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలను కల్పించేందుకు ఈ తీర్పు తలుపులు తెరిచిందని మహుర్కర్ చెప్పారు.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును ఇవ్వడం ద్వారా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపారు. మరీ ముఖ్యంగా అధికరణ 27ను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఏదైనా మతానికి అనుకూలంగా వినియోగించరాదని ఈ అధికరణ చెప్తోందని చెప్పారు.
ఈ తీర్పు తప్పుడు దృష్టాంతాన్ని ఏర్పరచిందని, అనవసరమైన రాజకీయ బురద జల్లుడు కార్యక్రమానికి ఓ అంశంగా మారిందని, సామాజిక అశాంతికి కారణమైందని చెప్పారు. ఆర్టీఐ దరఖాస్తుపై స్పందించని ఢిల్లీ వక్ఫ్ బోర్డుపై సీఐసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీఐ దరఖాస్తుదారు సుభాశ్ అగర్వాల్‌కు సరైన సమాధానం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది.
ఆయన కోల్పోయిన సమయం, వనరులకు పరిహారంగా రూ.25,000 ఆయనకు చెల్లించాలని బోర్డును ఆదేశించింది. రాజ్యం ద్వారా ముస్లింలకు ప్రత్యేక మతపరమైన ప్రయోజనాలను కల్పించడం గురించి పరిశీలించేటపుడు చరిత్రలోకి వెళ్ళవలసిన అవసరం ఉందని మహుర్కర్ చెప్పారు.
భారత దేశాన్ని మతపరంగా విభజించాలని భారతీయ ముస్లింలలోని కొందరు డిమాండ్ చేయడంతో ఓ మతపరమైన (ఇస్లామిక్) దేశం పాకిస్థాన్ ఏర్పాటైందని తెలిపారు. పాకిస్థాన్ మతపరమైన (ఇస్లామిక్) దేశంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, భారత దేశం అన్ని మతాలకు సమాన హక్కులను కల్పించే రాజ్యాంగాన్ని ఎంచుకుందని గుర్తు చేశారు.
 1947కు పూర్వం ముస్లింలకు ప్రత్యేక ప్రయోజనాలను కల్పించే విధానం దేశ విభజనకు దారి తీసిందని పేర్కొంటూ ముస్లింలలోని ఓ వర్గంలో పాన్-ఇస్లామిక్, విభజనవాద ధోరణులను ప్రోత్సహించడానికి ఈ విధానం కారణమైందని చెప్పారు. కేవలం మసీదుల్లో మాత్రమే ఇమాంలకు, ఇతరులకు పారితోషికం ఇవ్వడం హిందువులకు, ముస్లిమేతర మైనారిటీ మతాలవారికి ద్రోహం చేయడమవుతుందని స్పష్టం చేయసారు.
 అంతేకాకుండా భారతీయ ముస్లింలలోని ఓ వర్గంలో పాన్-ఇస్లామిక్ ధోరణులను ప్రోత్సహించడమవుతుందన్నారు. ఈ ధోరణులు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. కేవలం ముస్లింలకు మాత్రమే ప్రత్యేక మతపరమైన ప్రయోజనాలను కల్పించే చర్యల వల్ల, అంటే ప్రస్తుత విచారణాంశం వంటివాటివల్ల, మతాల మధ్య సామరస్యం తీవ్రంగా ప్రభావితమవుతుందని పేర్కొన్నారు. అతి తీవ్ర జాతీయవాదులు మొత్తం ముస్లింలను వ్యతిరేకించే పరిస్థితులు వస్తాయని తెలిపారు.
ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి దాదాపు రూ.62 కోట్లు గ్రాంట్ పొందుతోందని తెలిపారు. అయితే ఆ బోర్డుకు తన సొంత వనరుల ద్వారా నెలకు సుమారు రూ.30 లక్షలు ఆదాయం వస్తోందని చెప్పారు.  బోర్డు పరిధిలోని మసీదుల్లో పని చేసే ఇమాంలకు నెలకు రూ.18,000 చొప్పున; మౌజీన్‌లకు నెలకు రూ.16,000 చొప్పున గౌరవ వేతనాన్ని పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు.  అపీలుదారు ప్రస్తావించిన ఉదాహరణలో ఓ హిందూ దేవాలయంలోని అర్చకుడు నెలకు కేవలం రూ.2,000 మాత్రమే పొందుతున్నారని తెలిపారు.
మతపరమైన మైనారిటీల పరిరక్షణ పేరుతో ఇటువంటి చర్యలను సమర్థించినట్లయితే, ఫలానా మతపరమైన మైనారిటీకి పరిరక్షణ హక్కు ఉన్నపుడు, బహుళ మతాలుగల దేశంలోని మెజారిటీ కమ్యూనిటీకి కూడా పరిరక్షణ హక్కు ఉంటుంది కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని తెలిపారు.  బహుళ మతాలుగల దేశంలో అన్ని మతాలవారి హక్కులకు సమానంగా రక్షణ పొందాలని, మతాల మధ్య సామరస్యం, దేశ ఐకమత్యం దృష్ట్యా ఇది అవసరమని తెలిపారు.
 ఇమాంలకు జీతాలు ఇస్తున్నట్లు ఢిల్లీ వక్ఫ్ బోర్డు మొదట నిరాకరించిందని, ఆ తర్వాత సవరించిన సమాధానంలో అది జీతం కాదని, గౌరవ వేతనమని తెలిపిందని మహుర్కర్ చెప్పారు.  మొదట్లో మాటల గారడీతో సమాచారాన్ని దాచిపెట్టడానికి బోర్డు ప్రయత్నించిందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలపైనా, సాంఘిక సామరస్యంపైనా ప్రభావం చూపే కేసులో ప్రతివాదులు (వక్ఫ్ బోర్డు) ఎంత మాత్రం పారదర్శకంగా వ్యవహరించలేదని తెలిపారు.
అన్ని మతాలవారినీ సమానంగా చూడాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని మతాలకు ఏకరీతిగా చట్టాలను వర్తింపజేయడంపైనా ప్రభావం చూపే కేసులో బోర్డు వ్యవహార శైలిలో పారదర్శకత లేదని పేర్కొరు. ఆర్టీఐ దరఖాస్తుదారు అగర్వాల్ కోరిన సమాచారాన్ని అందజేయాలని ఢిల్లీ వక్ఫ్ బోర్డును, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సీఐసీ ఆదేశించింది. కమిషన్ ఆదేశాలను రిట్ పిటిషన్ల ద్వారా ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేయవచ్చు.