గుజరాత్ లో ఒలింపిక్స్, ఉమ్మడి పౌరస్మృతి, 20 లక్షల ఉద్యోగాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వరుసగా ఏడవ సారి గెలుపుకై శ్రమిస్తున్న బిజెపి ఉచిత హామీలు చేయకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎన్నికల ప్రణాలికను శనివారం విడుదల చేసింది. 
 
గాంధీనగర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ బిజెపి అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 2036లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు గాను గుజరాత్ ఒలింపిక్ మిషన్ ప్రారంభిస్తామని అందులో ప్రకటించారు.
ఉమ్మడి పౌరస్మృతిని రాష్ట్రంలో అమలు చేస్తామని, మహిళలకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని, రూ.10,000 కోట్లతో అగ్రి-మార్కెటింగ్ ఇన్ఫ్రా, బ్లూ ఎకానమీ ఇండస్ట్రీస్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, ఈడబ్ల్యూఎస్/ఓబీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ వాగ్దానం చేసింది.  పేద ప్రజలకు, విద్యకు ప్రత్యేక నిధి కేటాయిస్తామని, ఎయిమ్స్ స్థాయి వైద్య సౌకర్యాల కల్పన, సౌరాష్ట్ర సహా దక్షిణ గుజరాత్‌లో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని హామీ ఇచ్చింది.
మార్పులకు నిలయమైన గడ్డ గుజరాత్ అని జేపీ నడ్డా ఈ సందర్భంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ, ఆయన గుజరాత్ నుంచే తన జర్నీ ప్రారంభించారని చెప్పారు. దేశానికి ఒక రాజకీయ దిశానిర్దేశాన్ని ఇచ్చిన రాష్ట్రం గుజరాత్ అని పేర్కొన్నారు. గుజరాత్ ప్రగతి కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడల గమ్యస్థానంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్ ఎకానమీకి చేరుస్తామని, ఉగ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్, భారత వ్యతిరేక శక్తులను గుర్తించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే వారి కోసం కఠిన చట్టం తెస్తామని, సంఘ వ్యతిరేక శక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలుగా గుజరాత్ ప్రజల ప్రమాభిమానాలను బీజేపీ ఎంతగానే చూరగొందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఉత్తుత్తి హామీలు కావని, పీఎం మోదీ నిర్దేశించిన విధంగా రూపొందించిన అభివృద్ధి రోడ్ మ్యాప్ అని చెప్పారు. ఇందుకు తాము కట్టుబడి ఉంటామని, అమలుకు సాధ్యమైన హామీలు మాత్రమే తాము ఇస్తామని చెప్పారు.
 

మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే

  • 2036లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు గాను గుజరాత్ ఒలింపిక్ మిషన్ ప్రారంభిస్తాం
  • ఉగ్రముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు యాంటీ రాడికలైజేషన్ యూనిట్ ఏర్పాటు
  • ఉమ్మడి పౌరస్మృతి అమలు
  • వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన
  • మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
  • వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులకు రూ. 10 వేల కోట్ల కేటాయింపు
  • విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • రూ. 10 వేల కోట్లతో రాష్ట్రంలోని 20 వేల స్కూళ్ల అభివృద్ధి
  • ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు
  • మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణాలు
  • ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్థిక సాయం
  • ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు
  • బాగా చదివే కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు