ముంబై ఉగ్రదాడుల వెనుక నాటి ప్రభుత్వ అలసత్వం!

* ఇంకా వెలుగులోకి రాని14 ఏళ్ళ కిందటి వాస్తవాలు  
నవంబర్ 26, 2008న ముంబైపై 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు జరిపిన భయంకరమైన దాడి జరిగిన 14 ఏళ్ల తర్వాత, ముంబై పోలీసుల ప్రతిస్పందనపై ఉన్నతస్థాయి కమిటీ కనుగొన్న విషయాలు ఇప్పటికీ బహిరంగ పరచలేదు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి రామ్‌ప్రదాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇద్దరు సభ్యుల కమిటీ సభ్యుడు వి.బాలచంద్రన్‌ ఈ నివేదికను ప్రజలకు అందజేయాలని స్పష్టం చేశారు. 
ప్రధాన్, బాలచంద్రన్ తమ నివేదికను ఏప్రిల్ 2009లో మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. భద్రతా కారణాలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను “అత్యంత గోప్యమైనది”గా ట్యాగ్ చేసింది.

 “మేము నివేదికను సమర్పించిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ దానిని విడుదల చేయాలనుకున్నారు. అకస్మాత్తుగా, అది అత్యంత రహస్యంగా పరిగణించబడిందని మేము కనుగొన్నాము” అని బాలచంద్రన్ న్యూస్9 ప్లస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన బాలచంద్రన్ దేశ బాహ్య గూఢచార సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో పనిచేశారు.
 
 “చివరకు ఉగ్రవాద వ్యతిరేక విభాగాలలో పనిచేస్తున్న అధికారులు సహితం ఆ నివేదిక ప్రతిని పొందలేకపోయారు. మేము 27 సిఫార్సులు చేసాము. గూఢచార వ్యాప్తిపై నా అనుభవం ఆధారంగా నేను వివరాలు ఇచ్చాను.  మహారాష్ట్ర ప్రభుత్వం చాలా విచిత్రంగా ఎందుకు వ్యవహరించింది?  మా 100 పేజీల నివేదికను ప్రజలకు అందించాలని మేము కోరినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఎంధుకు అత్యంత రహస్యంగా ఉంచింది? ఇది ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదమే” అని ఆయన స్పష్టం చేశారు.

నివేదికను సభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర గందరగోళం నెలకొంది. బదులుగా, ప్రభుత్వం ఐదు పేరాగ్రాఫ్‌ల యాక్షన్ టేక్ నివేదికను ప్రవేశపెట్టింది. ఇది ప్రతిపక్షాలను ఆగ్రహానికి గురిచేసింది. 

 
26/11 దాడులకు స్పందించడంలో ముంబై పోలీసుల లోపాలను పరిశీలించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పోలీసుల ప్రతిఘటన ఎందుకు విఫలమైంది? ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్‌పై చర్య తీసుకున్నారా, సరిపోతుందో లేదో పరిశీలించాలని ప్రభుత్వం కమిటీని కోరింది. భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తమ సిఫార్సులు చేయాలని కూడా ప్యానెల్‌ను కోరింది. 
 
కంట్రోల్ రూంకు దాదాపు 360 నుంచి 400 కాల్స్ వచ్చినట్లు బాలచంద్రన్ గుర్తించారు. ముంబయిపై సముద్రం వైపు నుండి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. “లియోపోల్డ్‌ని టార్గెట్ చేస్తారని అస్సాం నుండి ఒక హెచ్చరిక వచ్చింది. ఆ నివేదికలను పర్యవేక్షిస్తున్న వ్యక్తికి లియోపోల్డ్‌  ముంబైలోని ఓ రెస్టారెంట్ అని తెలియదు. వారు కేవలం లియోపోల్డ్‌ని టార్గెట్ చేస్తారని చెప్పారు. అదృష్టవశాత్తూ (విశ్వాస్) నాంగ్రే- పాటిల్ (అప్పటి డీసీపీ)కి లియోపోల్డ్ అంటే  తెలుసు.. అందుకే వెంటనే రెండు సార్లు అక్కడికి వెళ్లి వారిని అప్రమత్తం చేశాడు’’ అని బాలచంద్రన్ చెప్పారు. 
ముంబైపై ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని నిఘా నివేదికలు అందుబాటులో ఉన్నప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ విషయం గురించి చర్చించడానికి ఓ సమావేశాన్ని కూడా పిలవలేదని ఆయన ఎత్తి చూపారు. ఢిల్లీ నుండి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది. ప్రభుత్వ అధికారులు సమావేశానికి పిలవకుండా ఎస్ఎంఎస్ ద్వారా సంబంధిత వ్యక్తులకు సమాచారం అందించారు.
 “ఇది మహారాష్ట్ర ప్రభుత్వ పరంగా చాలా ఘోరమైన లోపం. రహస్య నిఘా సమాచారంపై వారు చర్యలు తీసుకోలేదు. ఆ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కోస్ట్ గార్డ్, నేవీని అప్రమత్తం చేసి, నావికాదళం పెట్రోలింగ్ ప్రారంభించినట్లయితే, బోటు – కుబేర్ – సౌరాష్ట్ర తీరం నుండి ఎప్పటికీ హైజాక్ చేయబడి ఉండేది కాదు. 26/11 ఉండేది కాదు.”  అని స్పష్టం చేశారు.
 
బాలచంద్రన్ ‘ఇంటెలిజెన్స్ ఓవర్ సెంచరీస్’ అనే పుస్తకాన్ని వ్రాశారు. అందులో ప్రారంభ కాలం నుండి నేటి వరకు గూఢచారులు, గూఢచర్యం చరిత్రను వివరించారు. “ఈ పుస్తకం ఇంటెలిజెన్స్ అధికారుల కోసం కాదు సాధారణ ప్రజల కోసం,” అని ఆయన చెప్పారు. “మనలో ఒక ధోరణి ఉంది.  ఇది భారతదేశంలోనే కాకుండా వెలుపల కూడా ఉంది. గూఢచార సంస్థ నుండి అధికారికంగా సమాచారం వచ్చినప్పుడు మాత్రమే మేము దానిని తీవ్రంగా పరిగణిస్తాము. అది నిజంగా సరైనది కాదు.” 
 
పాకిస్థానీ దాడులకు స్థానికుల నుంచి మద్దతు లభించిందన్న ఊహాగానాలను కూడా ఆయన కొట్టిపారేశారు. “కేంద్ర సంస్థల ప్రతిస్పందన గురించి దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనందుకు నేను భారత ప్రభుత్వాన్ని తప్పుపట్టాను. వారు కనీసం ఏమి తప్పు జరిగిందో తెలుసుకొని, పరిస్థితులను మెరుగు పరచడానికి  వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉండాల్సింది” అని బాలచంద్రన్ తెలిపారు.