తెలంగాణ లో వచ్చేది బిజెపి ప్రభుత్వమే

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో బిజెపి విజయం సాదిస్తుందని , ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేసారు. ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ టైమ్స్ నౌ నిర్వహించిన సమ్మిట్‌లో అమిత్ షా పాల్గొంటూ తెలంగాణలో బీజేపీ గాలి విస్తోందని, కింద స్థాయి వరకు తనకు ప్రజల నాడి తెలుసంటూ తెలిపారు.
వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నేరుగా వెళ్లి అక్కడే ఉంటానని, బీజేపీని గెలిపిస్తానంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఖచ్చితంగా మార్పు వస్తుందని, బీజేపీ దక్షిణాది ప్రవేశంకు తెలంగాణ గేట్ వే అంటూ అమిత్ షా అభివర్ణించారు. తెలంగాణ ప్రజల నాడి తనకు బాగా తెలుసని, తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా గెలుస్తుందని జోస్యం చెప్పారు.
 
అత్యధిక సీట్లతో గెలిచి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరు కొనసాగిస్తుండటం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీజేపీ నేతలను చిక్కుల్లో పడేసిన క్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 
2047 నాటికి అగ్రరాజ్యంగా భారత్ 
 
ఇది వెనుకకు చూసుకొని, తప్పొప్పులను ఎంచుకొనే సమయం కాదని, ముందు చూపు అవసరం అని చెబుతూ భారత్ స్వతంత్రం సాధించి 100 ఏళ్ళు అయ్యే 2047 నాటికి ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగే విధంగా మనం నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. 
 
గత ఎనిమిదేళ్ల పాలనలో భారతదేశం అనేక ఘనతలు సాధించిందని చెప్పుకొస్తూ ఇదంతా రాజకీయ సుస్థిరత, అవినీతి లేని పాలన, అభివృద్ధి పూర్వక విధానాలు, పెట్టుబడిదారుల పట్ల స్నేహపూర్వకంగా ఉండే అజెండా కారణం అని తెలిపారు.  అందుకనే నేడు శాంతియుత వాతావరణం దేశంలో నెలకొన్నదని చెప్పారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడమే కాకుండా, ప్రతి రంగంలో మొదటి స్థానంలో ఉండాలని దేశ ప్రజల ముందు ప్రధాని మోదీ ఓ లక్ష్యం ఉంచారని అమిత్ షా తెలిపారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా నిర్ణయించుకొని, ఆ దేశంగా వేగంగా ముందడుగు వేస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత్ పలుకుబడి పెరుగుతూ ఉండడం మనందరికీ గర్వకారణం అని చెబుతూ వాతావరణ మార్పు, అంతర్జాతీయ శాంతి వంటి అంశాలలో భారత్ నాయకత్వ స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై భారత దేశ అభిప్రాయం తెలుసుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది జి 20 అధ్యక్ష స్థానం స్వీకరించడం మన విలువలు, ప్రత్యేకతలను ప్రపంచంకు చూపేందుకు ఓ గొప్ప అవకాశం అని అమిత్ షా చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించేవారు సహితం ఆర్ధిక రంగంలో దేశం సాధించిన విజయాలను గుర్తిస్తారని చెబుతూ ఇవే వాబోయే 25 ఏళ్ళు భారత దేశంకు చెందినవిగా ఉండేవిధంగా చేస్తాయని భరోసా వ్యక్తం చేశారు.
2004 నుండి 2014 వరకు అంతర్జాతీయంగా 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ మోదీ పాలనలో 5వ స్థానకు చేరుకున్నదని ఆయన గుర్తు చేశారు. పటిష్టమైన ఆర్ధిక విధానాలే కరోనా మహమ్మారి నుండి తొందరగా దేశం కోలుకొనే విధంగా చేశాయని ఆయన చెప్పారు.