బోయినపల్లి అభిషేక్​కు 14 రోజుల రిమాండ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడు, తెలంగాణలోని అధికార పక్షం నేతలకు సన్నిహితుడిగా భావిస్తున్న బోయినపల్లి అభిషేక్​కు సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే, చలికాలం వేసుకునే దస్తులు, పుస్తకాలు, అవసరమైన మెడిసిన్ అందించాలని జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ నాయర్​కు మరో 2 రోజులు ఈడీ కస్టడీని పొడిగించింది.
లిక్కర్ స్కాంలో సీబీఐ కేసుకు సంబంధించి ఈ నెల 14న అభిషేక్, విజయ్ నాయర్​కు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, వెంటనే 5 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తర్వాత ఈడీ విజ్ఞప్తి మేరకు కస్టడీని మరో 5 రోజులు పొడిగించింది. మొత్తం 10  రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు గురువారం అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్​ను సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.
 సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్ నాగ్​పాల్ అభిషేక్​కు డిసెంబర్ 8 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో విజయ్ నాయర్​ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని, మరో ఐదు రోజుల కస్టడీ అప్పగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ మిట్ట బెంచ్​ను కోరారు. విజయ్ నాయర్ లాప్ ట్యాప్ ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించినట్లు తెలిపారు.
ల్యాప్ డాటా రికవరీ జరుగుతుందని, లిక్కర్ స్కామ్​లో విజయ్ నాయర్ ల్యాప్​టాప్​​ రిపోర్ట్ చాలా కీలకమని వివరించారు. ఫోరెన్సీ ల్యాబ్ నుంచి ల్యాప్​టాప్ రిపోర్టు రేపు రానుందని బెంచ్ కు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు చేతులు మారాయని, వీటికి సంబంధించిన వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు.
 ఈడీ విచారణకు విజయ్ నాయర్ సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది ఇప్పటికే నాయర్ అన్ని వివరాలు ఈడీకి చెప్పారని, మెయిల్ వివరాలు, ల్యాప్ టాప్ పాస్ వర్డ్ కూడా ఇచ్చారని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న జడ్జ్ నాగ్ పాల్.. మరో 2 రోజులు విజయ్ నాయర్ కు ఈడీ కస్టడీ విధించారు. అభిషేక్ ను మాత్రం తిహార్ జైల్ కు తరలించారు.
లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న తెలంగాణకు చెందిన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు ఇంటి నుండి ఆహారం అందించేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. సెలెక్టెడ్ బుక్స్​ను మాత్రం అందించాలని జైలు అధికారులను ఆదేశించింది.