భారత్ – గల్ఫ్ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై నేడే చర్చలు

స్వేచ్చావాణిజ్య ఒప్పందం గురించి భారత్‌, గల్ఫ్‌ సహకార మండలి (జిసిసి) మధ్య గురువారం చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల ద్వారా వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) లక్ష్యమని ఓ అధికారి తెలిపారు.
 
 జిసిసి అనేది గల్ఫ్‌ ప్రాంతంలోని .. సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్‌, కువైట్‌, ఒమన్‌, బహ్రెయిన్‌ వంటి యూనియన్‌. భారత్‌ ఇప్పటికే యుఎఇతో ఈ ఏడాది మేలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేసింది.
 
జిసిసి సభ్య దేశాలకు భారత్‌ నుండి ఎగుమతులు 2020-21లో 27.8 బిలియన్‌ డాలర్ల నుండి 2021-22లో 44 బిలియన్‌ డాలర్లకు పెరిగి ప్రస్తుతం 58.26 బిలియన్‌ డాలర్లకు చేరిందని వాణిజ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత్‌ మొత్తం దిగుమతుల్లో జిసిసి సభ్య దేశాల వాటా 2020-21లో 15.5 శాతం ఉండగా, 2021-22లో 18 శాతానికి చేరింది.
 
ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 154.73 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. భారత్‌ – జిసిసిమధ్య గతంలో 2006 నుండి 2008 సంవత్సరాల్లో రెండు రౌండ్ల చర్చలు జరిగినందున ఇవి చర్చల పున: ప్రారంభం కానున్నాయి. జిసిసి అన్ని దేశాలు, ఆర్థిక గ్రూప్‌లతో చర్చలు వాయిదా వేసినందున మూడో రౌండ్‌ చర్చలు జరగలేదు.
 
భారత్‌ సౌదీ అరేబియా, ఖతార్‌ల నుండి ముడిచమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకోగా, ఆయా దేశాలకు ముత్యాలు, విలువైన, పాక్షిక విలువైన రంగు రాళ్లు, మెటల్స్‌, రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాలు, ఎలక్ట్రిక్‌ యంత్రాలు, ఇనుము, స్టీల్‌, రసాయనాలు ఎగుమతి చేస్తోంది. వాణిజ్యంతో పాటు గల్ఫ్‌ దేశాలు భారత్‌ జనాభాకు ఆతిథ్యమిస్తున్నాయి.
 
దాదాపు 32 మిలియన్ల ప్రవాస భారతీయుల్లో (ఎన్‌ఆర్‌ఐ)ల్లో, దాదాపు సగం మంది గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్నారని అంచనా. వీరు గణనీయమైన మొత్తంలో డబ్బును ఇంటికి పంపుతారు. దీంతో భారత్‌ వద్ద విదేశీ చెల్లింపులు గణనీయంగా ఉంటాయని అంచనా. 2021లో భారత దేశానికి 87 బిలియన్‌ డాలర్ల విదేశీ చెల్లింపులు వచ్చినట్లు ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. వీటిలో అధిక భాగం జిసిసి దేశాలదేనని తెలిపింది.