భారత సైన్యానికి బాలీవుడ్‌ నటి రిచా చద్దా క్షమాపణలు

గాల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై పలు రాజకీయ పార్టీలతో పాటుసోష‌ల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్‌ భార‌తీయ ఆర్మీని చాలా చుల‌క‌న చేసిన‌ట్లు ఉందని, భారత జవాన్ల త్యాగాలను తక్కువ చేసేదిలా ఉందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 
 
 భారత దేశంలో ఉంటూ.. ఆ దేశ సైన్యంపై అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు సిగ్గుండాలి..? అని విరుచుకుపడుతున్నారు. ట్విటర్‌లపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో ఎట్టకేలకు రిచా చద్దా స్పందించారు. జరిగిన పొరపాటుకు చింతిస్తూ.. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.
 
దీంతో రిచా తాజాగా స్పందిస్తూ  ఉద్దేశపూర్వకంగా ఈ ట్వీట్‌ చేయలేదని తెలిపింది. ఈ మేరకు భారత సైన్యానికి క్షమాపణలు చెప్పింది. ‘ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం నాకు లేదు. నా ట్వీట్‌ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి. మాది కూడా సైనిక కుటుంబమే. గతంలో మా తాత లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో సైన్యంలో పని చేశాడు’ అంటూ ట్వీట్‌ చేసింది.
 
కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు ఇండియ‌న్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు నార్తర్న్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నట్లుగా ఓ నెటిజెన్ ట్వీట్ చేశారు. 
 
 ఆ ప్రక‌ట‌న‌పై రిచా స్పందిస్తూ.. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ కామెంట్ చేసింది. ఐతే ఆమె ఉద్దేశం ఏంటో గానీ.. గాల్వన్ లోయ ఘర్షణ గురించి అందులో కామెంట్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబట్టుతున్నారు. ఆ వ్యాఖ్యల‌పై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నటి దిగొచ్చి క్షమాపణలు చెప్పింది.
 
దేశ సైన్యాన్ని , భద్రతా బలగాను దేశ ప్రజలు గౌరవిస్తారని.. ఆర్మీ చీఫ్ ఏం చేసినా దానిని గౌరవిస్తారని బీజేపీ పేర్కొంది. ఈ తరహా పోస్టులతో ఆర్మీని అవహేళన చేయడం దురదృష్టకరమని మండిపడింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి..ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది.  జాతి వ్యతిరేక పోస్టులు చేసే వారిపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది.